IndiGo | విమానాల్లో సాంకేతిక సమస్యలు (technical snag) ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెల అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ఒకదాని తర్వాత ఒక విమానంలో ఇలాంటి సమస్యలు బయటపడుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఓ ఇండిగో (IndiGo) విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఫ్లైట్లో కూడా ఇలాంటి సమస్యే ఉత్పన్నమైంది.
ఇండిగో 6E 5118 విమానం ఢిల్లీ (Delhi) నుంచి ఇంఫాల్ (Imphal) బయల్దేరింది. విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. గాల్లోకి ఎగిరిన కాసేపటికే విమానం తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ విషయాన్ని ఇండిగో సంస్థ కూడా ధృవీకరించింది. సమస్యను పరిష్కరించిన తర్వాత విమానం తిరిగి ఇంఫాల్ బయల్దేరి వెళ్లినట్లు తెలిపింది.
ఇండిగో విమానంలో ఇంజిన్ వైఫల్యం..
బుధవారం ఢిల్లీ నుంచి గోవాకు బయల్దేరిన ఇండిగో విమానంలో సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. ఇంజిన్ వైఫల్యం తలెత్తటంతో అత్యవసరంగా విమానాన్ని ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి గోవాకు బయల్దేరిన ఫ్లైట్ నంబర్ ‘6ఈ-6271’లో సాంకేతిక లోపం తలెత్తిందని ఇండిగో అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. దీంతో ఆ విమానాన్ని హఠాత్తుగా ముంబైకి దారిమళ్లించినట్టు తెలిపారు. ఆ సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ముంబై ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు వెల్లడించారు.
Also Read..
Intel | 5 వేల మందిని తొలగిస్తున్నాం.. లేఆఫ్స్ ప్రకటించిన ఇంటెల్
Ranya Rao | గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. రన్యారావుకు ఏడాది జైలు శిక్ష