Ranya Rao | కర్ణాటకలో బంగారం స్మగ్లింగ్ కేసు (gold smuggling case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు (Ranya Rao)కు ఏడాది పాటూ జైలు శిక్ష పడింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు (COFEPOSA) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రన్యారావుతోపాటు మరో ఇద్దరు నిందితులు తరుణ్ రాజు, సాహిల్‌కు కూడా ఏడాది జైలు శిక్ష విధించింది. అక్రమ రవాణాకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో వారు ఈ ఏడాది కాలంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని బోర్డు ఈ సందర్భంగా తెలిపింది.
దుబాయి నుంచి 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో రన్యారావును అరెస్టు చేశారు. దాదాపు రూ.12.56కోట్ల విలువైన బంగారాన్ని నడుము, కాళ్లకు బ్యాండేజీలు, టిష్యూ పేపర్ల సహాయంతో చుట్టుకొని దాచి రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్మగ్లింగ్ వ్యవహారంపై కస్టమ్స్ చట్టం, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెపై డీఆర్ఐ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు మే 20న బెయిల్ మంజూరు చేసింది.
అయితే, మే 23న ఆమెపై డీఆర్ఐ కాఫెపోసా చట్టం కింద కేసు నమోదు చేసింది. దీంతో రన్యారావు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అక్రమ రవాణాలో పాల్గొనడం, స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొనడం.. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణకు భంగం కలిగించే పనులు చేసినట్లు అనుమానం ఉన్న వ్యక్తులను విచారణ లేకుండా నిర్బంధంలో ఉంచే అధికారాన్ని ఈ చట్టం కల్పిస్తుంది.
Also Read..
IndiGo | ‘ప్యాన్.. ప్యాన్.. ప్యాన్’ కాల్ ఇచ్చిన ఇండిగో పైలట్.. ఇంతకీ ఏంటి దీని అర్థం..?
Nitish Kumar | 125 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్.. ఎన్నికల వేళ బీహార్ సీఎం కీలక ప్రకటన