IndiGo | విమాన ప్రమాదాల సమయంలో పైలట్లు అత్యవసర పరిస్థితిని సూచించే కొన్ని ఎమర్జెన్సీ మెసేజ్‌లు పంపిస్తుంటారు. అందులో ‘మేడే కాల్’ గురించే మనం ఇప్పటి వరకూ విన్నాం. ‘ప్యాన్ ప్యాన్ ప్యాన్’ అనే ఓ రేడియో డిస్ట్రెస్ కాల్ కూడా ఉంటుందని తెలుసా. అయితే, ఇది మేడే కాల్ అంత తీవ్రంగా లేకపోయినా.. సమస్య తలెత్తినప్పటికీ ప్రాణాపాయం లేని సందర్భాల్లో పైలట్లు ‘ప్యాన్ ప్యాన్ ప్యాన్’ (PAN PAN PAN) సందేశాన్ని పంపుతారు.
తాజాగా ఢిల్లీ నుంచి గోవాకు బయల్దేరిన ఇండిగో (IndiGo) విమానం పైలట్ ‘ప్యాన్ ప్యాన్ ప్యాన్’ అనే సందేశాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు పంపారు. దీంతో ‘ప్యాన్’ అంటే ఏంటి..? అన్న సందేహం తలెత్తింది. విమానం గగనతలంలో ఉన్నప్పుడు రెండు ఇంజిన్లలో ఒక దానిలో సమస్య తలెత్తిన (Engine Failure) సమయంలో ఈ ఎమర్జెన్సీ మెసేజ్‌ను పంపుతారు. ‘ప్యాన్’ అనేది ఫ్రెంచ్ పదం. ‘బ్రేక్ డౌన్’ అని దీని అర్థం.
‘విమానంలో సమస్య తలెత్తింది.. అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సంబంధిత అధికారులకు పైలట్లు తెలియజేయడానికి ఈ ‘ప్యాన్’ పదాన్ని వాడుతుంటారు. పరిస్థితి అత్యంత తీవ్రమైనది కానప్పటికీ.. క్లిష్టమైనది అని చెప్పేందుకు ఈ మెసేజ్ ఇస్తారు. పైలట్ నుంచి ఈ కాల్ రాగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అప్రమత్తమవుతుంది. గగనతలాన్ని క్లియర్ చేసి.. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తుంది. అంతేకాదు, ఎయిర్‌పోర్టు వద్ద ముందుజాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ సేవలను కూడా సిద్ధం చేస్తుంది.
ఇండిగో విమానంలో ఇంజిన్ వైఫల్యం..
ఢిల్లీ నుంచి గోవాకు బయల్దేరిన ఇండిగో విమానంలో ఇంజిన్ వైఫల్యం తలెత్తటంతో అత్యవసరంగా విమానాన్ని ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి గోవాకు బయల్దేరిన ఫ్లైట్ నంబర్ ‘6ఈ-6271’లో సాంకేతిక లోపం తలెత్తిందని ఇండిగో అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. దీంతో ఆ విమానాన్ని హఠాత్తుగా ముంబైకి దారిమళ్లించినట్టు తెలిపారు. ఆ సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు వెల్లడించారు.
Also Read..
Nitish Kumar | 125 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్.. ఎన్నికల వేళ బీహార్ సీఎం కీలక ప్రకటన
Bengaluru Stampede | తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణం.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నివేదిక
Heart Attack | షాకింగ్ ఘటన.. గుండెపోటుతో తొమ్మిదేళ్ల చిన్నారి మృతి