Lalu Yadav | బీహార్ ఎన్నికల (Bihar Elections) ఫలితాల అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ (Lalu Yadav) కుటుంబంలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్న విషయం తెలిసిందే. ఫలితాలు వెలువడిన తర్వాత లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. అంతేకాదు, తన కుటుంబంతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా సంచలన ప్రకటన చేశారు. ‘తేజస్వీ సన్నిహితులు సంజయ్, రమీజ్ నాతో బలవంతంగా ఇది చేయిస్తున్నారు. అన్ని తప్పులకు నన్ను బాధ్యులను చేయిస్తున్నా’రని ఆరోపించారు. రోహిణి ఆరోపణలు ఆర్జేడీలో ప్రకంపనలు సృష్టించాయి.
ఈ నేపథ్యంలో కుటుంబంలో చీలికలపై లాలూ యాదవ్ (Lalu Yadav) తొలిసారి స్పందించారు. ఇది కుటుంబ అంతర్గత విషయమని.. తాను పరిష్కరిస్తానంటూ వ్యాఖ్యానించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో లాలూ యాదవ్ సమావేశం నిర్వహించారు. పాట్నాలో జరిగిన సమావేశానికి లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, పెద్ద కుమార్తె మిసా భారతి, జగదానంద్ సింగ్ సహా సీనియర్ ఆర్జేడీ నాయకులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో ఆర్జేడీ ఎల్పీ లీడర్‌గా తేజస్వీ యాదవ్‌ను ఎన్నుకున్నారు.
ఈ మీటింగ్ సందర్భంగా ఫ్యామిలీలో విభేదాల గురించి లాలూ ప్రస్తావించారు. ‘ఇది కుటుంబ అంతర్గత విషయం. కుటుంబంలోనే పరిష్కరించాలి. ఈ సమస్యను నేను పరిష్కరిస్తా’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవలే జరిగిన బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్ కూటమి ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. 243 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆర్జేడీ కేవలం 25 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.
Also Read..
Sabarimala | శబరిమలకు పోటెత్తిన భక్తులు
భారతీయులకు ఇరాన్ వీసా-ఫ్రీ ఎంట్రీ రద్దు
మానిటర్ ఐదు నిమిషాలు ఆగినా.. కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!