న్యూఢిల్లీ, నవంబర్ 17: ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు సాఫ్ట్వేర్ కంపెనీ కాగ్నిజెంట్ (Cognizant) కఠినమైన విధానాన్ని తీసుకొస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఉద్యోగుల ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ మానిటర్ ఐదు నిమిషాలు ఆగినా.. ఎలాంటి యాక్టివిటీ లేకున్నా.. దానిని ‘ఐడిల్’గా మార్కింగ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం గాను కంపెనీ ‘ప్రోహాన్స్’ అనే టూల్‌ను వినియోగించేందుకు సిద్ధమవుతుందట.
ఇది సదరు ఉద్యోగుల కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి ఇస్తారని, దాంతో మౌస్, కీబోర్డ్ వాడకం ఆధారంగా ఉద్యోగి పనితీరును అంచనావేస్తారని తెలిసింది. సంస్థ ఇప్పటికే ఈ చర్యలు చేపట్టిందని, మైక్రో-ట్రాకింగ్‌ను మరింత విస్తరించేందుకు ‘కాగ్నిజెంట్’ చర్యలు చేపడుతున్నదని సమాచారం. దీనిపై ఉద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తం కాగా, ఇది ఇండస్ట్రీలో సర్వసాధారణమని కాగ్నిజెంట్ పేర్కొన్నది.