Nitin Gadkari | దేశంలో అత్యంత కాలుష్య (Delhi pollution) నగరాల్లో దేశరాజధాని ఢిల్లీ (Delhi) మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఏటా శీతాకాలం సమయంలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరస్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మూడు రోజులు ఢిల్లీలో ఉంటే.. కాలుష్యం కారణంగా అలర్జీలు (allergies) వచ్చాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొని మాట్లాడారు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యానికి 40 శాతం రవాణా రంగమే కారణమని అంగీకరించారు. ‘నేను రవాణా శాఖ మంత్రిని. 40 శాతం కాలుష్యానికి రవాణా రంగమే కారణం’ అని తెలిపారు.
‘ఇది ఎలాంటి జాతీయవాదం..? శిలాజ ఇంధనాలు పరిమితంగా ఉన్నాయి. కాలుష్యం పెరుగుతోంది. శిలాజ ఇంధన వినియోగాన్ని మనం తగ్గించలేమా..? సున్నా కాలుష్యానికి దారితీసే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ శక్తితో నడిచే వాహనాలను మనం ఎందుకు ప్రోత్సహించలేము..?’ అని నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. శిలాజ ఇంధనాల్ని దిగుమతి చేసుకోవడానికి ఏటా రూ.22 లక్షల కోట్ల ఖర్చు అవుతోందని.. ఇది ఆర్థిక భారమని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాల వైపు మళ్లాలని సూచించారు.
కాగా, ఢిల్లీ కాలుష్యంపై గడ్కరీ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే. తాను రాజధాని నగరంలో రెండు లేదా మూడు రోజులకంటే ఎక్కువ ఉండలేనని అన్నారు. ఢిల్లీకి వస్తే.. ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనే ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘నేను ఢిల్లీలో రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఉండగలను. అంతకుమించి ఉండటం నావల్ల కాదు. ఢిల్లీలో అడుగుపెట్టగానే ఎప్పుడు వెళ్లిపోదామా అనే ఉంటుంది. అందుకే నేను వచ్చేటప్పుడే రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకుంటాను. ప్రజలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఢిల్లీలో కాలుష్యం కారణంగా సాధారణ ప్రజల ఆయుర్దాయం తగ్గింది. వాహనాలకు వినియోగించే శిలాజ ఇంధనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడం ప్రజలందరి ప్రధాన బాధ్యత’ అని అన్నారు.
Also Read..
Indians arrest | కాలిఫోర్నియాలో అక్రమ వలసదారులు అరెస్ట్.. వారిలో 30 మంది ఇండియన్స్
Bangladesh | భారత్తో ఘర్షణలు కోరుకోవడం లేదు : బంగ్లాదేశ్