హైదరాబాద్, డిసెంబర్ 23 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా పథకాలను ప్రారంభించింది. అయితే, మొదలుపెట్టిన ప్రతీ పథకమూ అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. ఈ వరుసలో 2015లో ప్రారంభించిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై-స్కిల్ఇండియా మిషన్) కూడా చేరింది. 2022 నాటికి 50 కోట్ల మంది యువతీ, యువకులకు నైపుణ్యాభివృద్ధితో పాటు ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా ఈ స్కీమ్‌ను తీసుకొచ్చారు.
డెడ్‌లైన్ దాటి మూడేండ్లు గడిచినప్పటికీ, మోదీ ‘స్కిల్ ఇండియా’ పథకం లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు. స్కీమ్‌ను అనుసరించి పారిశ్రామికావసరాలకు తగిన శిక్షణను కనీసం 50 కోట్ల మందికి కల్పించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1.32 కోట్ల మందికి మాత్రమే శిక్షణను ఇచ్చారు. ఇందులో 1.1 కోట్ల మంది మాత్రమే సర్టిఫికెట్లు అందుకొన్నారు. అంటే, స్కీమ్ సక్సెస్ రేటు 2 శాతంగా చెప్పుకోవచ్చు.
అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచిన ‘స్కిల్ ఇండియా’ స్కీమ్‌పై కేంద్రం రూ.10,194 కోట్లు ఖర్చు చేసింది. కాగ్ నివేదికను బట్టి, అభ్యర్థులకు శిక్షణను ఇవ్వకుండానే ఇంత పెద్ద మొత్తంలో నిధులను దేనికి ఖర్చు చేశారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ‘స్కిల్ ఇండియా’ స్కీమ్‌లో గోల్మాల్ జరిగిందా? అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.