సోమవారం 25 జనవరి 2021
National - Dec 04, 2020 , 01:26:15

ఈ ‘పద్మవిభూషణ్‌' నాకొద్దు

ఈ ‘పద్మవిభూషణ్‌' నాకొద్దు

  • తిరిగిచ్చేసిన అకాలీ అగ్రనేత బాదల్‌  
  • రైతులకు గౌరవం లేనప్పుడు ఈ గౌరవం తనకు అక్కర్లేదని లేఖ
  • బాదల్‌ బాటలోనే సుఖ్‌దేవ్‌సింగ్‌పద్మభూషణ్‌ను ఇచ్చేస్తానని ప్రకటన 
  • ఇదే బాటలో కొందరు క్రీడాకారులు

చండీగఢ్‌: మోదీ సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా శిరోమణి అకాలీదళ్‌ అగ్రనేత, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ తన పద్మవిభూషణ్‌ అవార్డును తిరిగి ఇచ్చేశారు. అకాలీ (డెమోక్రాటిక్‌) నేత, రాజ్యసభ సభ్యుడు సుఖ్‌దేవ్‌సింగ్‌ ధిండ్సా కూడా గత ఏడాది తనకు ప్రదానం చేసిన పద్మభూషణ్‌ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. కొందరు పంజాబీ క్రీడాకారులు సైతం తమ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తామని హెచ్చరించారు. ‘ప్రజలు... ముఖ్యంగా సామాన్య రైతుల వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను. సామాన్య రైతు తన గౌరవాన్ని కోల్పోయినప్పుడు పద్మవిభూషణ్‌ గౌరవాన్ని నేను ఉంచుకోవడంలో అర్థం లేదు’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు రాసిన లేఖలో బాదల్‌ పేర్కొన్నారు. తమ జీవిత ప్రాథమిక హక్కు కోసం రైతులు తీవ్రమైన చలిలోనూ పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు నమ్మకద్రోహం చేసినందుకు, శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనోద్యమం చేస్తున్న రైతుల పట్ల అగౌరవంగా, అలక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా బాదల్‌ తన పద్మవిభూషణ్‌ అవార్డును తిరిగి ఇచ్చేశారని శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రెండు నెలల క్రితం బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ నుంచి ఎస్‌ఏడీ బయటకు వచ్చేసింది. ఈ చట్టాలపై పంజాబ్‌లో నిరసనలు మొదలవడంతో బాదల్‌ కోడలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. బాదల్‌ ఐదుసార్లు పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ అవార్డును 2015లో బాదల్‌కు ప్రదానం చేశారు. రైతుల నమ్మకాన్ని గెలవడానికి, దేశ లౌకిక, ప్రజాస్వామిక నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్రపతి తన అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వానికి హితబోధ చేస్తారని ఆశిస్తున్నానని బాదల్‌ పేర్కొన్నారు. రైతుల నిరసనోద్యమాన్ని దేశ వ్యతిరేక చర్యగా చిత్రించడానికి జరుగుతున్న కుట్రలు బాధ కలిగిస్తున్నాయని తెలిపారు. వృద్ధులు, మహిళలు సహా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో కష్టాలు పడుతున్నారని సుఖ్‌దేవ్‌సింగ్‌ ధిండ్సా పేర్కొన్నారు. ‘మేమూ రైతుబిడ్డలమే. అవార్డుతో మేమేం చేసుకోవాలి? భుజం భుజం కలిపి రైతులకు అండగా ఉంటాం’ అని తెలిపారు.


logo