Bismah Maroof : పాకిస్థాన్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్(Bismah Maroof) ఆటకు వీడ్కోలు పలికింది. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఆమె గురువారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. గాయాలు వేధిస్తున్నా సరే .. ఆటపై మక్కువతో 8 వరల్డ్ కప్(World Cup)లు ఆడిన మరూఫ్ సెంచరీ కల నెరవేరకుండానే వీడ్కోలు పలికింది. మరూఫ్ సంచలన నిర్ణయంతో పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది.
‘నాకెంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. ఇన్నేండ్ల నా ప్రయాణం చాలా గొప్పగా సాగింది. ఎన్నో సవాళ్లు, చిరస్మరణీయ విజయాలు, మర్చిపోలేని జ్ఞాపకాలు.. చాలా చవిచూశాను. ఈ సందర్భంగా నాకు మద్దతుగా నిలిచిన కుటుంబసభ్యులకు ధన్యవాదాలు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)కు ప్రత్యేక కృతజ్ఞతలు. నా కోసం పేరెంటల్ పాలసీ తీసుకొచ్చి.. నేను మళ్లీ దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు, ఈ సుదీర్ఘ జర్నీలో అన్నివేళలా సపోర్ట్ చేసిన జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది, అభిమానలకు కృతజ్ఞతలు’ అని మరూఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.
An incredible career that began in 2006 👏
Tribute to @maroof_bismah – Pakistan’s most prolific run-scorer in Women’s ODIs and T20Is 🌟 pic.twitter.com/J1Ebd0GYVi
— Pakistan Cricket (@TheRealPCB) April 25, 2024
మరూఫ్ 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. తన సంచలన బ్యాటింగ్, చెక్కుచెదరని పట్టుదతో పదేండ్లలోనే కెప్టెన్ స్థాయికి ఎదిగింది. 2016లో టీ20 పగ్గాలు, ఆ మరుసటి ఏడాదే వన్డే సారథిగా ఎంపికైంది. ఆమె కెప్టెన్సీలో పాక్ 34 వన్డేల్లో, 64 టీ20ల్లో జయభేరి మోగించింది. మరూఫ్ నేతృత్వంలోని పాక్ 2010, 2014 ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం కొల్లగొట్టింది.
కుటుంబంతో మరూఫ్..
మరూఫ్ తన 18 ఏండ్ల కెరీర్లో ప్లేయర్‌గా, కెప్టెన్‌గా పాకిస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించింది. 32 ఏండ్ల మరూఫ్ ఇప్పటివరకూ 136 వన్డేలు, 140 టీ20లు ఆడింది. పాక్ జట్టు తరఫున అత్యధిక పరుగుల రికార్డు ఆమె పేరిటే ఉంది. వన్డేల్లో 3,369, టీ20ల్లో 2,893 రన్స్ కొట్టిన మరూఫ్ రెండు ఫార్మాట్లలో కలిపి 32 హాఫ్ సెంచరీలు బాదింది.