హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8(నమస్తే తెలంగాణ) : ‘తమాషా చేస్తున్నారా? నేనేం టో నీకు తెలియదు. నీ అంతు చూస్తా. వారం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని కమిట్మెంట్ ఇచ్చారు. సమయానికి బిల్లులు తయారు చేయడం చేతకాకపోతే వెళ్లిపోండి’ అంటూ ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన సిబ్బందికి లార్విన్ ఫార్మా కంపెనీ యజమాని దమ్కీ ఇచ్చారట. అది కూడా దవాఖాన డైరెక్టర్ ముందేనట. మొన్న మంత్రి షాడో, ఇప్పుడు మందుల సప్లయర్. ఇలా ఎవరు పడితే వారు వచ్చి, దమ్కీలు ఇవ్వడం, దురుసుగా ప్రవర్తించడం, చిందులేయడం పరిపాటిగా మారిందని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన ఉద్యోగులు, అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎవరు, ఎప్పుడొచ్చి, ఏం చేస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కమీషన్లు తీసుకుని జేబు లు నింపుకొనేది వాళ్లు, బెదిరింపులు, మాట లు పడాల్సింది తామంటూ ఆవేదన చెందుతున్నారు.
ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానకు మందు లు, సర్జికల్స్ సరఫరా చేసే పలువురు డీల ర్లు, కంపెనీలకు 9 నెలలుగా బిల్లులు చెల్లించలేదు. ఇటీవలే ఒక మంత్రి షాడో రంగంలోకి దిగి ఎంఎన్‌జేలోనే దుకాణం పెట్టి మరీ కొందరి బిల్లులు సెటిల్మెంట్లు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో బిల్లులు పెండింగ్‌లో ఉం డగా కమీషన్లు ఇచ్చిన కొందరికి మాత్రమే బిల్లులు మంజూరు చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం రూ.15కోట్ల నిధు లు మంజూరు కాగా అందులో ‘లార్విన్ ఫార్మా’ కంపెనీకి సుమారు రూ.5.5 కోట్లు, శ్రేష్ఠకు రూ.3 కోట్లు, దత్తసాయి కంపెనీకి రూ.2 కోట్లు చొప్పున చెల్లించాల్సిందిగా ఎంఎన్‌జె డైరెక్టర్ అక్కడి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. మొదటి దఫాలో లార్విన్ కంపెనీకి సుమారు రూ.1.8కోట్లు, దత్తసాయికి రూ.80లక్షలు, శ్రేష్టకు రూ.కోటి చొప్పున చెల్లించినట్టు తెలిసింది. లార్విన్ ఫార్మా యజమాని తాజాగా ఎంఎన్‌జే దవాఖానకు వెళ్లారట. ‘వారం రోజుల్లోనే మొత్తం బిల్లులు చెల్లిస్తామని కమిట్మెంట్ ఇచ్చారు, ఇప్పటివరకు నాకు ఇ చ్చింది రూ.కోటి చిల్లరనే’ అంటూ హంగా మా చేసినట్టు తెలిసింది. దవాఖాన డైరెక్టర్ చాంబర్‌కు సిబ్బందిని పిలిపించి ‘ఏం తమా షా చేస్తున్నారా? మినిస్టర్ అంటే కూడా లెక్కలేదా? నేను తలుచుకుంటే నిన్ను ఏం చేస్తానో తెలుసా?. నాకు వన్వీక్లో బిల్లులు చెల్లిస్తామని కమిట్మెంట్ ఇచ్చారు. ఇప్పటివరకు ఇచ్చిందెంత? చెప్పిన సమయంలో బిల్లులు తయారు చేయడం చేతకాకపోతే సీటులో నుంచి వెళ్లిపోండి’ అంటూ ధమ్కీ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఒక ప్రైవేటు వ్యక్తి వచ్చి ఏకంగా తన చాంబర్లోనే దవాఖాన సిబ్బందికి ధమ్కీలు ఇస్తున్నా ఎంఎన్‌జే డైరెక్టర్ ప్రేక్షక పాత్ర వహించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బందిని అడ్డగోలు మాటలు అంటున్నా కనీసం వారించకపోగా, తిరిగి తన ఉద్యోగులనే సర్దుకుపొమ్మంటూ ఉచిత సలహా ఇచ్చినట్టు చెప్తున్నారు. ఉద్యోగులపై చిందులేసిన లార్విన్ యజమానిని వారించాల్సిన ఇతర అధికారు లు అందుకు భిన్నంగా వ్యవహరించారట. ఒక అధికారి నిలోఫర్ కేఫ్ నుంచి కాఫీ తెప్పించి రాచమర్యాదలు చేసి, బిల్లుల సంగతి తాను చూసుకుంటానంటూ భరోసా కల్పించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు మండిపడుతున్నారు. రూ.కోట్ల బిల్లులు రాత్రికి రాత్రే తయారు చేయమంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. పదులు, వందల సంఖ్య లో ఉన్న బిల్లులను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని, ఒక్కో బిల్లు తయారు చేసేందుకు నాలుగు రోజుల సమయం పడుతుందన్నారు. హడావుడిగా చేస్తే, రేపు లెక్కల్లో ఏదైన తేడా వస్తే ఎవరు బాధ్యులు? అని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ‘కమీషన్లు తీసుకుని సెటిల్మెంట్లు చేసిన వారు బాగానే ఉంటారు. వారి కి సహకరించినవారూ బాగానే ఉంటారు. మేమెందుకు బలికావాలి?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. డైరెక్టర్ అసమర్థత కారణంగానే ప్రైవే టు వ్యక్తులు వచ్చి రాజ్యమేలుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మందుల కొరత, పనిచేయని వైద్యపరికరాలు, మరోపక్క అవినీతి, అక్రమాలతో ఎంఎన్‌జే పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని చెప్తున్నారు.