Meenakshi Natarajan | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ ఈ నెలాఖరులో తెలంగాణను విడిచి వెళ్లిపోతున్నారా? గురువారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ, పీఏసీ విస్తృత స్థాయి సమావేశమే ఆమె ఆఖరి మీటింగా? అని అడిగితే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఈ నెల చివరివారంలో జరుగబోయే ఏఐసీసీ కార్యవర్గ మార్పు చేర్పుల్లో ఆమెను తెలంగాణ నుంచి మార్చే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో ఇమడలేకపోతున్నానని ఇప్పటికే ఆమె పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్టు ప్రచారంలో ఉన్నది. క్షేత్రస్థాయిలో పార్టీ బాగు కోసం తాను చేసిన ప్రయత్నాలు విఫల మయ్యాయని ఆమె మనోవేదన చెందుతున్న ట్టు తెలిసింది. ముఖ్యనేత వ్యవహారశైలితో విసుగెత్తిపోయారని, అందుకే తెలంగాణను విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారని కాంగ్రె స్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇక్కడి నుంచి ఆమె పంపిన నివేదికలు రాహుల్‌గాంధీ వరకు చేరకుండా ఢిల్లీ స్థాయిలో ఓ పెద్ద మనిషి అడ్డుకున్నారని చర్చ జరుగుతున్నది. అందుకే తెలంగాణలో ఉండలేనంటూ ఢిల్లీ పెద్దలకు లేఖ రాసినట్టు చెప్తున్నారు.
మీనాక్షి గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ విషయంలో అత్యంత నికచ్చిగా వ్యవహరిస్తారని, రాహుల్ గాంధీకి ఆమె అత్యంత సన్నిహితురాలు అనే పేరు ఉన్నది. వచ్చీరాగానే క్షేత్రస్థాయి పర్యటనలు, సమావేశాలు, సమీక్షలు నిర్వహించి రాష్ట్ర కాంగ్రెస్ నేతలను హడలెత్తించారు. అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య విపరీతమైన గ్యాప్ ఉన్నదని గుర్తించి దానిని చకదిద్దే పని పెట్టుకున్నారు. ముఖ్యనేత కేవలం వలస కాంగ్రెస్ నేతలనే ప్రమోట్ చేస్తున్నారని పసిగట్టి ఢిల్లీకి నివేదికలు పంపినట్టు ప్రచారం జరిగింది. మీనాక్షి పంపిన నివేదికల ఫలితంగా రాహుల్ గాంధీకి, ముఖ్యనేతకు మధ్య అంతరం మరింత పెరిగినట్టు అప్పట్లో ఢిల్లీ వర్గాల్లో చర్చ నడిచింది. ఆమె వచ్చిన తొలినాళ్లలోనే కంచ గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూముల వివాదం తెరమీదికి వచ్చింది. చిట్టడవిగా విస్తరించి, జంతువుల ఆవాసానికి అనుకూలంగా మారిన ఈ భూములను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విక్రయానికి పెట్టడం, ఇవి తమ భూములు అని హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగిన విష యం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆమె విద్యార్థులకు అనుకూలంగా వ్యవరించారని, దీంతో ముఖ్యనేత ఆమెపై గుర్రుగా ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఢిల్లీలో ఆమె పరపతి ముందు ముఖ్యనేత బలం సరిపోకపోవటంతో కొంతకాలం మౌనంగా ఉండిపోయినట్టు చెప్తున్నారు. క్రమంగా ఆమె పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో నిక్కచ్చిగా వ్యవహరించారని, ముఖ్యనేత దూకుడుకు అడ్డుకట్ట వేశారని గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పాత కేడర్‌కు ప్రాధాన్యత తగ్గిందని, ఈ సమస్యను పరిష్కరించడం కోసం తాను చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదని మీనాక్షి అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. టెండర్ల విషయంలో మంత్రుల మధ్య విభేదాలు బయటపడటం, ఈ వ్యవహారంలో కనీసం మందలింపు కూడా లేకుండా సులువుగా సమస్యను పరిషరించామనే సంకేతాలు పంపటం కోసం రాష్ట్ర నాయకులు వ్యవహరించిన తీరు పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. తాజాగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఆమె ఢిల్లీకి లిస్ట్ పంపితే అధిష్టానంలోని కీలక నేత ఒకరు ఆ జాబితాను బుట్టదాఖలు చేసి, రాష్ట్రం నుంచి ముఖ్యనేత నేత పంపిన పేర్లకు ఆమోదం తెలిపినట్టు ప్రచారం జరిగింది. అప్పటి నుంచే ఆమె తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.