హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ) : పథకాల అమలుకు నిధుల్లేవంటూ అరుస్తున్న కాంగ్రెస్ సర్కార్పెద్దలు తమ అవసరాలకు మాత్రం ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో వీడియో వాల్ (స్క్రీన్) ఏర్పాటుకు భారీగా వెచ్చించిన ఉదంతాన్నే పలువురు ఉదహరిస్తున్నారు.
స్క్రీన్ కొనుగోలుకు ప్రభుత్వం ఏకంగా రూ.85.85 లక్షలు ఖర్చు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్క్రీన్ ఏర్పాటుకు సంబంధించి నవంబర్‌లో టెండర్లు పిలువగా ఓ కంపెనీ రూ.85.85 లక్షలకు పనులు దక్కించుకున్నది. నీళ్లకు సంబంధించిన అంశంపై ప్రజాప్రతినిధులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికే సర్కార్ ఈ స్క్రీన్‌ను కొనుగోలు చేసినట్టు తెలిసింది. అంత ఖర్చు చేసిన స్క్రీన్ ఆ తర్వాత ఏ మేరకు ఉపయోగిస్తారనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం. నాలుగు రోజుల వినియోగించే స్క్రీన్ కోసం ఇంత ప్రజాధనం ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యాదగిరిగుట్ట, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : అధికార కాంగ్రెస్ పార్టీ బీసీల ఆకాంక్షతో చెలగాట మాడుతున్నదని ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆరోపించారు. నిజం గా కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి బీసీలపై ప్రేమ ఉంటే అన్నిపార్టీలను ఏకంచేసి బీసీ బిల్లుపై పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని డిమాండ్‌చేశారు. మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో గురువారం యాదగిరిగుట్టలోని పద్మశాలీ భవన్లో బీసీ యువత, కులసంఘాల నేతలతో జరిగిన బీసీ సంఘటిత శక్తి నిర్మాణ శిక్షణ శిబిరానికి జూలూరు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 78 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీలు బీసీలను మోసగిస్తూనే ఉన్నాయని దుయ్యబట్టారు. ద్రోహం తలపెట్టేవాడు ఇంటోడైనా, బయటోడైనా బీసీ ఉద్యమం వారిని వదిలిపెట్టదని హెచ్చరించారు. తెలం గాణలో కొనసాగుతున్న బీసీ ఉద్యమం పాలకులు జోకొడితే నిద్రపోయే దశలో లేదని, అది నివురుగప్పిన నిప్పులా ప్రజ్వరిల్లుతూనే ఉన్నదని హెచ్చరించారు.