Asaduddin Owaisi : కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) మరోసారి విమర్శలు గుప్పించారు. బిహార్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ రాష్ట్ర ఓటర్ల జాబితాలో విదేశీయులను గుర్తించారు సరే.. మరి, పహల్గాం (Pahalgam)లో ఉగ్రదాడికి పాల్పడి 26 మందిని కాల్చి చంపిన హంతకులను ఎందుకు వదిలేసినట్టు? అని ప్రధానిపై ఓవైసీ మండిపడ్డారు.
‘బిహార్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో బంగ్లాదేశీయులు, రొహింగ్యాలు, నేపాల్ దేశస్తులు ఉన్నారని గుర్తించారు. పహల్గాంలోకి ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారు? అనే విషయంపై దర్యాప్తు ఎందుకు చేయలేదు?’ అని బుధవారం జరిగిన బోధన్ సభలో ప్రధాని నరేంద్ర మోడీని సూటిగా ప్రశ్నించారు ఓవైసీ. అంతేకాదు ఉగ్రవాదులు చొరబడి వచ్చి అమాయకులను చంపేసిన ఘటనకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) ఈమధ్యే బాధ్యత తీసుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.
‘జమ్ముకశ్మీర్లో మీ అధికారులు ఏం చేస్తున్నారు? ఉగ్రవాదులు మా హిందూ సోదరులను పొట్టనబెట్టుకున్నప్పుడు మీరు మొద్దు నిద్రపోతున్నారా? ఆ విషాదకర ఘటన జరిగి నెలలు గడుస్తున్నాయి. కానీ, జూలైలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భద్రతా వైఫల్యం అని.. తాను బాధ్యత తీసుకుంటానని చెబుతున్నారు. ఇన్ని రోజులు ఏం చేశారు. విహారం కోసం వెళ్లిన 26 మంది అమాయకులను పొట్టనరబెట్టుకున్న వాళ్లను పట్టుకునేంతవరకూ ఆపరేషన్ సిందూర్ను కొనసాగించాలి. ఆ రోజు నరమేధం సృష్టించిన ఆ నలుగురు ఉగ్రవాదులను పట్టుకునేంత వరకూ నేను మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు.