రవీంద్రభారతి, జూలై17: వంట గ్యాస్ డెలివరీ కార్మికులను వేధిస్తున్న గ్యాస్ డీలర్లపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేస్తామని తెలంగాణ కుకింగ్గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నకిరేకంటి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. తమపై గ్యాస్ డీలర్ల వేధింపులపై కార్మికశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కార్మిక శాఖ అధికారుల భరతం పడుతామని ఆయన హెచ్చరించారు.
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్దారక భవన్లో గురువారం తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కార్యకవర్గం, సలహాదారులు సమావేశమయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ గ్యాస్ డీలర్ల వద్ద దాదాపు 30 వేల మంది గ్యాస్ డెలివరీ వర్కర్స్ పనిచేస్తున్నారని తెలిపారు. కానీ ఏ ఒక్క గ్యాస్ ట్రేడర్ కూడా కార్మిక శాఖ నిబంధనలు పాటించకుండా కార్మికులను వేధిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని, ఈఎస్ఐ-పీఎఫ్ చెల్లించకుండా అన్యాయంగా డెలివరీ కార్మికులను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గౌరవ సలహదారుడు చామకూర రాజు మాట్లాడుతూ.. కార్మిక శాఖ అధికారులు పూర్తిగా నిద్రావస్థలో ఉన్నారని మండిపడ్డారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి త్వరలో కార్మిక శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. గత మూడు నెలల క్రితం కమిషనర్‌ను లిఖితపూర్వకంగా అపాయింట్మెంట్ కోరినా ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని అగ్రహం వ్యక్తం చేశారు. సలహాదారుడు కేవీ గౌడ్ మాట్లాడుతూ.. గ్యాస్ ఏజేన్సీలు అనేక రకాలుగా డెలివరీ కార్మికులను వేధిస్తున్నారని, రాజకీయ పలుకుబడితో కార్మికుల పొట్టకుడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తక్షణమే 904 మెమోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.