Pomegranate Peel | దానిమ్మ పండ్లు చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఎరుపు రంగులో దర్శనమిస్తుంటాయి. ఈ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. దానిమ్మ పండ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కొందరు జ్యూస్ తాగేందుకు ఇష్టం చూపిస్తారు. దానిమ్మ పండ్లను తినడం వల్ల మనకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. పలు వ్యాధులను నయం చేసే శక్తి దానిమ్మ పండ్లకు ఉంటుంది. అయితే దానిమ్మ పండ్లు మాత్రమే కాదు, దాని తొక్క కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. లేదా తొక్కను ఎండబెట్టి పొడి చేసి దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా దానిమ్మ తొక్కను వాడితే ఎన్నో లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ తొక్కలతో పలు చిట్కాలను పాటించడం వల్ల వ్యాధులను నయం చేసుకోవచ్చని అంటున్నారు.
దానిమ్మ తొక్కలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దానిమ్మ గింజల కన్నా అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు దాని తొక్కలోనే ఉంటాయి. ముఖ్యంగా ఈ తొక్కలో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించడంలో సహాయం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో అంతర్గత వాపులు తగ్గిపోతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. నాడీ సంబంధ వ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మ పండు తొక్కలో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. శరీరంలో ఉండే వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. శరీరంలోని నొప్పులు తగ్గిపోతాయి. కండరాల నొప్పుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.
దానిమ్మ పండు తొక్కలో యాస్ట్రింజెంట్ గుణాలు ఉంటాయి. ఈ తొక్కలో టానిన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి పేగులు, జీర్ణాశయం గోడల మ్యూకస్ పొరను రక్షిస్తాయి. దీంతో విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్ట, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. దానిమ్మ పండు తొక్కలో ఉండే పాలిఫినాల్స్ మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
షుగర్ వ్యాధి ఉన్నవారు దానిమ్మ పండు తొక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు 2 సార్లు ఒక కప్పు మోతాదులో తాగుతుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి. ఈ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ ను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ నీళ్లను సేవిస్తుంటే శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ తగ్గుతుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. దానిమ్మ పండు తొక్కలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని తీసుకుంటే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు, జ్వరం, దగ్గు, జలుబు వంటి బారిన పడిన వారు దానిమ్మ పండు తొక్క నీళ్లను తాగుతుంటే త్వరగా కోలుకుంటారు. ఇలా దానిమ్మ పండు తొక్క వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చు.