Hyderabad | మియాపూర్, జూలై 17 : బస్సులో సిగరెట్ తాగొద్దన్నందుకు ఓ ప్రయాణికుడు బస్సు డ్రైవర్, క్లీనర్లపై దాడి చేసిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం…. కాచిగూడ నుంచి రాజస్థాన్‌కు వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సులో పూనా రామ్ అనే ప్రయాణికుడు సిగరెట్ వెలిగించాడు. తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని తాగొద్దని బస్సు డ్రైవర్, క్లీనర్ సదరు ప్రయాణికుడికి తెలిపారు. ఈ క్రమంలో డ్రైవర్, క్లీనర్ ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రయాణికుడు పునారామ్ నగరంలో వేర్వేరు ప్రాంతాలలో ఉండే తన స్నేహితులను ఫోన్ ద్వారా మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలోని బస్టాప్‌కు పిలిపించుకున్నాడు. ఇతర ప్రయాణికుల కోసం బస్సును నిలిపిన సందర్భాల్లో పూనారామ్తో పాటు అతడి స్నేహితులు బస్సు డ్రైవర్ పప్పు రామ్, క్లీనర్‌పై విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం వారి నుంచి లక్ష నగదు, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. ఈనెల 12వ తేదీన ఈ దాడి జరగ్గా, 13వ తేదీన బాధితుడు బస్సు డ్రైవర్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు దాడికి పాల్పడ్డ పూనా రామ్, నారాయణరావు, మహిపాల్, వికాస్, కైలాస్‌లను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.