Hockey player : ఒడిశా రాష్ట్రం (Odisha state) లోని సుందర్‌గఢ్ జిల్లా (Sundergarh district) లో 15 ఏళ్ల హాకీ క్రీడాకారిణి (Hockey player) పై ఆమెకు శిక్షణ ఇస్తున్న కోచ్‌లే (Coaches) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నలుగురు హాకీ కోచ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. రూర్కెలా (Rurkela) లోని సాయ్ (Sports Athourity of India) సెంటర్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు గడిచిన రెండేళ్లుగా సాయ్ కేంద్రంలో హాకీ శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో జూలై 3న సాయంత్రం స్థానిక స్టేడియంలో కోచింగ్ సెషన్ ముగిసిన తర్వాత నలుగురు కోచ్‌లు ఆ క్రీడాకారిణిని ఒక లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ వారు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
జూలై 21 రాత్రి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చర్యలు చేపట్టారని, నలుగురు శిక్షకులను అదుపులోకి తీసుకున్నారని భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ తెలిపారు. నలుగురు కోచ్‌లపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సోమవారం కోర్టులో బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. కాగా ఈ ఘటన క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.