HCA elections : హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (HCA) ఎన్నికలకు సంబంధించి ప్రింట్ (Print), ఎలక్ట్రానిక్ (Electronic) మీడియాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఊహాగానాలకు ఆజ్యం పోయవద్దని సూచించారు. ఈ మేరకు తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్ అదనపు డీజీపీ పేరుతో ప్రెస్‌నోట్ (Press note) విడుదల చేశారు.
నిజానిజాలను బేరీజు వేసుకోకుండా ఊహాగానాలకు ప్రచారం కల్పించడంపై మీడియా నియంత్రణ పాటించాలని ఆ ప్రెస్‌నోట్‌లో కోరారు. హెచ్‌సీఏ ఎన్నికల అక్రమాలపై జరుగుతున్న దర్యాప్తుకు సంబంధించిన అప్డేట్స్ను తప్పనిసరైతే తామే బయటికి వెల్లడిస్తామని తెలిపారు. సంస్థాగతమైన విశేష అధికారాలను అడ్డుకోలేమని, ఆ విషయం అర్థం చేసుకోకుండా హెచ్‌సీఏ ఎన్నికల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓటువేశారని ప్రచారం చేయడం కరెక్టు కాదని పేర్కొన్నారు. ఏ అధికారికి కూడా తన వ్యక్తిగత పలుకబడితో హెచ్‌సీఏ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం లేదని తెలిపారు.