Heavy Snow | చలి తీవ్రతకు ఉత్తర భారతం గజగజ వణికిపోతోంది. జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌ను మంచు దుప్పటి కప్పేసింది. ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అప్రమత్తమైన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను తాత్కాలికంగా మూసివేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో మూడు జాతీయ రహదారులు సహా మొత్తం 226 రోడ్లను మూసివేశారు. ఇందులో సిమ్లాలో 123 రోడ్లు, లాహౌల్, స్పితిలో 36, కులులో 25 రోడ్లు ఉన్నాయి. 173 ట్రాన్స్ఫార్మర్లకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో తీవ్రమైన చలి పరిస్థితుల కారణంగా భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
ఇక ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో త్యుని-చక్రతా-ముస్సోరీ జాతీయ రహదారి, ధరణాధర్-కోటి కనసర్ రహదారి పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది. జమ్ము కశ్మీర్‌లోని పలు ప్రదేశాలు చలికి అల్లాడిపోతున్నాయి. శ్రీనగర్‌లో మైనస్ 7 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఇది మరో 2 నుంచి 3 డిగ్రీల వరకూ తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
Also Read..
IRCTC Down | ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల అసహనం
CM Revanth Reddy | సీఎం రేవంత్‌తో సినీ పెద్దల భేటీ.. ఇండస్ట్రీకి ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవే
Lamborghini | నడిరోడ్డుపై మంటల్లో చిక్కుకున్న రూ.కోట్లు ఖరీదైన లాంబోర్గినీ కారు.. వీడియో