న్యూఢిల్లీ: సరుకులు 15 నిమిషాల్లోపు ఇంటింటికి చేరుతున్నాయని అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ తెలిపారు. (Jaya Bachchan) అయితే అంబులెన్స్‌ల ఆలస్యంతో రోగులు ఆసుపత్రికి చేరుకోలేక రక్తస్రావంతో మరణిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్‌ల కోసం రోడ్లపై ప్రత్యేకంగా అత్యవసర లేన్లు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బుధవారం రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా జయా బచ్చన్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘దేశంలో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా 15 నిమిషాల్లోపు కిరాణా సామాగ్రి, 30 నిమిషాల్లో పిజ్జాలు ఇంటింటికి చేరుతున్నాయి. అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వల్ల రోగులు రక్తస్రావంతో మరణిస్తున్నారు. 2018లో సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ప్రత్యేక అత్యవసర లేన్లు లేవు. ఈ విషాదాలను జాతీయ డేటా ఏదీ ట్రాక్ చేయదు’ అని అన్నారు.
కాగా, గ్రీన్ కారిడార్లు, పోలీసు ఎస్కార్ట్‌లు లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాల్లో 60 శాతం అంబులెన్స్‌లు సగటున 15 నుంచి 30 నిమిషాలు ఆలస్యంగా వస్తున్నాయని జయా బచ్చన్ తెలిపారు. దీంతో రోడ్డు ప్రమాద బాధితుల్లో 55 శాతం మందికి గోల్డెన్ అవర్ మిస్ అవుతోందని చెప్పారు. ‘జాతీయ అంబులెన్స్ కోడ్ 2016 ఉన్నప్పటికీ హైవేలలో ప్రత్యేక లేన్లు లేవు. ఈ క్లిష్టమైన వైఫల్యాలను గమనించి వెంటనే పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు.
మరోవైపు ఏఐ ట్రాఫిక్ సిగ్నల్స్‌తో కూడిన ప్రత్యేక అత్యవసర లేన్స్ ఏర్పాటు ద్వారా అంబులెన్స్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని జయా బచ్చన్ సూచించారు. సుప్రీంకోర్టు 2018లో పేర్కొన్న అంబులెన్స్ కారిడార్ ఆదేశాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించాలని అన్నారు. అలాగే అంబులెన్స్ ఆలస్యం వల్ల జరిగే మరణాలపై ఉన్నత స్థాయి దర్యాప్తు కోసం స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ ఏర్పాటును పరిశీలించాలని కేంద్రానికి సూచించారు.
Also Read:
Watch: పులి వేషంలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే.. ఎందుకంటే?
Drunk Man Operate On Woman | యూట్యూబ్ చూసి.. మద్యం మత్తులో ఆపరేషన్ చేసిన వ్యక్తి, మహిళ మృతి