లక్నో: ఒక వ్యక్తి అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఒక ఆపరేషన్ గురించి యూట్యూబ్‌లో చూశాడు. మద్యం మత్తులో ఉన్న అతడు బంధువుతో కలిసి మహిళకు సర్జరీ చేశాడు. అది వికటించడంతో ఆమె మరణించింది. (Drunk Man Operate On Woman) ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తెహబహదూర్ రావత్ భార్య మునిశ్రా కడుపు నొప్పితో బాధపడుతున్నది. దీంతో డిసెంబర్ 5న కోథి ప్రాంతంలోని దామోదర్ ఔషధాలయానికి ఆమెను భర్త తీసుకెళ్లాడు.
కాగా, ఆ క్లినిక్ నిర్వాహకుడు జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా ఆ మహిళను పరిశీలించాడు. మునిశ్రా కడుపులో రాళ్లు ఉండటంతో నొప్పితో ఆమె బాధపడుతున్నట్లు తెలిపాడు. రాళ్లు తొలగించేందుకు ఆపరేషన్ చేయాలని సూచించాడు. దీనికి రూ.25,000 ఖర్చు అవుతుందని చెప్పాడు. ఈ నేపథ్యంలో భార్యకు సర్జరీ కోసం రావత్ రూ.20,000 చెల్లించాడు. మునిశ్రాకు ఆపరేషన్ చేయగా ఆ మరునాడు ఆమె మరణించింది.
మరోవైపు ఆ మహిళ భర్త రావత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత సర్జరీ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపాడు. మద్యం మత్తులో ఉన్న అతడు బంధువైన వ్యక్తితో కలిసి తన భార్యకు ఆపరేషన్ చేసినట్లు చెప్పాడు. పొట్టలో లోతుగా కోయడంతో పలు రక్త నాళాలు తెగి ఆమె మరణించినట్లు ఆరోపించాడు.
ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఆ క్లినిక్‌ను తనిఖీ చేశారు. జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా మేనల్లుడు వివేక్ కుమార్ మిశ్రా రాయ్‌బరేలిలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆ ముసుగులో ఏళ్లుగా క్లినిక్‌ను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గ్రహించారు. దీంతో ఆ క్లినిక్‌కు సీల్ వేశారు. వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Police Kidnap Student | విద్యార్థిని కిడ్నాప్ చేసి.. నకిలీ డ్రగ్స్ కేసులో ఇరిగించిన పోలీసులు
Watch: ఈ డబ్బు ఎవరిదని అడిగిన పాక్ స్పీకర్.. చేతులెత్తిన 12 మంది ఎంపీలు