బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. (Karnataka Congress MLA BR Patil) రాజీవ్ గృహ నిర్మాణ పథకంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ పథకం లబ్ధిదారుల జాబితాను బహిరంగపరిస్తే సొంత ప్రభుత్వం షేక్ అవుతుందని అన్నారు. కర్ణాటక రాష్ట్ర పాలసీ అండ్ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ కూడా అయిన బీఆర్ పాటిల్ సొంత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ వ్యక్తిగత సహాయకుడు సర్ఫరాజ్ ఖాన్‌తో ఆయన మాట్లాడారు. రాజీవ్ గాంధీ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. లంచం ఇచ్చిన వారికి మాత్రమే ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. తనలాంటి ఎన్నికైన ప్రతినిధుల సిఫార్సు లేఖలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, తన అలంద్ నియోజకవర్గంలో 950 ఇళ్ల పంపిణీలో అధికారులు లంచాలు తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఆరోపించారు. ‘ఎవరైతే డబ్బు చెల్లించారో, వారు ఇళ్లు పొందారు. ఇది వ్యాపారమా?’ అని ఆయన ప్రశ్నించారు. తన సిఫార్సుల కంటే డబ్బు చెల్లించిన వారి సిఫార్సులకు హౌసింగ్ కార్పొరేషన్ ఎందుకు ప్రాధాన్యత ఇచ్చిందని నిలదీశారు. ఇలా అయితే తనకు ఎలాంటి గౌరవం ఉంటుందని అన్నారు.
మరోవైపు బీఆర్ పాటిల్ ఆరోపణలను సర్ఫరాజ్ ఖాన్ ఖండించారు. లంచం పొందిన వ్యక్తుల వివరాలు తనకు అందిస్తే జైలుకు పంపుతామని చెప్పారు. అయితే ‘లబ్ధిదారుల జాబితాను బహిరంగంగా ప్రకటిస్తే ప్రభుత్వం కదిలిపోతుంది’ అని పాటిల్ హెచ్చరించారు.
కాగా, బీఆర్ పాటిల్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య జరిగిన ఈ సంభాషణ ఆడియో క్లిప్ లీకైంది. దీంతో బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప దీనిపై స్పందించారు. బీఆర్ పాటిల్ చెప్పింది వంద శాతం నిజమని తెలిపారు. ‘లంచం ఇవ్వకుండా ఈ ప్రభుత్వంలో ఏ పని జరుగదు. వారి సొంత ఎమ్మెల్యే ఇది చెబుతున్నారు. ప్రభుత్వం దీనిని అంగీకరించి తమ తప్పును సరిదిద్దుకోవాలి’ అని అన్నారు.
మరోవైపు ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. ఆయన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ నాగరాజ్ యాదవ్ తెలిపారు. అవినీతిపై పోరాడటానికి కర్ణాటక ప్రభుత్వం గట్టిగా కట్టుబడి ఉందని అన్నారు.
Also Read:
Himanta Sarma | 5000 విదేశీ ఫేస్బుక్ ఖాతాలు అకస్మాత్తుగా యాక్టివ్: హిమంత
Will Crash Plane | మహిళా వైద్యురాలు దురుసు ప్రవర్తన.. విమానాన్ని కూల్చివేస్తానని బెదిరింపు