బెంగళూరు: మహిళా వైద్యురాలు విమానం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది. ఆమె సీటు వద్ద కాకుండా ముందు వరుస క్యాబిన్లో ఉంచిన బ్యాగ్‌ను తీసేందుకు నిరాకరించింది. వాగ్వాదం ముదురడంతో విమానాన్ని కూల్చివేస్తానని ఆమె బెదిరించింది. (Will Crash Plane) ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది ఆ మహిళను విమానం నుంచి దించి అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. యెలహంక సమీపంలోని శివనహళ్లిలో నివసించే 36 ఏళ్ల వ్యాస్ హిరాల్ మోహన్‌భాయ్ మహిళా డాక్టర్. జూన్ 17న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సూరత్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఆమె ఎక్కింది. తన బ్యాగ్‌ను మొదటి వరుస క్యాబిన్ వద్ద ఉంచి 20 ఎఫ్ సీటులో కూర్చొన్నది.
కాగా, విమాన సిబ్బంది దీనిని గమనించారు. మహిళా డాక్టర్ వ్యాస్ హిరాల్ కూర్చొన్న సీటు పైన ఉన్న క్యాబెన్లో ఆ బ్యాగ్ ఉంచాలని కోరారు. దీనికి ఆమె నిరాకరించింది. సిబ్బందే తన బ్యాగును అక్కడ ఉంచాలని చెప్పింది. సిబ్బంది పదే పదే అభ్యర్థించినప్పటికీ, పైలట్ జోక్యం చేసుకున్నప్పటికీ ఆ లేడీ డాక్టర్ వినిపించుకోలేదు. సిబ్బందితో ఆమె దురుసుగా ప్రవర్తించింది. ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకోవడంపై అరిచి గోల చేసింది. విమానాన్ని కూల్చివేస్తానని ఆమె బెదిరించింది.
మరోవైపు మహిళా వైద్యురాలు వ్యాస్ హిరాల్ మోహన్‌భాయ్ ప్రవర్తనపై భద్రతా సిబ్బంది, సీఐఎస్ఎఫ్ను విమాన సిబ్బంది, పైలట్ అప్రమత్తం చేశారు. దీంతో వారు ఆ మహిళను విమానం నుంచి దించివేశారు. మిగతా ప్రయాణీకుల భద్రతకు ముప్పు కలిగించిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పౌర విమానయాన చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Air India | నిర్వహణపరమైన సమస్యలు.. పలు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా
Calf Born With 2 Heads | రెండు తలలు, మూడు కళ్ళతో జన్మించిన దూడ.. చూసేందుకు ఎగబడిన జనం