న్యూఢిల్లీ: ఒక బాలిక ఇంటి నుంచి పారిపోయింది. ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకుని రోడ్డుపై జీవించింది. ఆ తర్వాత ఒక వ్యక్తి ఆమెను పెళ్లి కోసం అమ్మేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ఆ అమ్మాయి పోషకాహార లోపంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. చిక్కిశల్యమైన ఆ బాలిక చివరకు మరణించింది. (Girl Ran From Home, Sold for Marriage) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. దయాల్పూర్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక, కుటుంబ సభ్యులతో గొడవ వల్ల గత ఏడాది ఇంటి నుంచి పారిపోయింది. కుటుంబం ఆమె గురించి పట్టించుకోలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు.
కాగా, ఇంటి నుంచి పారిపోయిన ఆ బాలిక ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకుని కొంతకాలం రోడ్డుపై జీవించింది. ఆ తర్వాత ఆమెను రాజస్థాన్‌కు చెందిన వ్యక్తికి ఒకరు అమ్మేయడంతో అతడు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇంటి నుంచి తప్పించుకున్న ఆ అమ్మాయి హర్యానా చేరుకున్నది.
మరోవైపు అక్టోబర్ 24న హర్యానాలోని పానిపట్‌లో తీవ్ర అనారోగ్యంతో రోడ్డు పక్కన పడి ఉన్న ఆ బాలికను అటుగా వెళ్లే వ్యక్తి గమనించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు వచ్చి పరిశీలించారు. పోషకాహార లోపంతో చిక్కిశల్యమైన ఆ బాలిక పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. ఢిల్లీలోని జీటీబీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెను చేర్చారు.
కాగా, తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆ బాలిక గురించి ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇంటి నుంచి పారిపోయిన తనను పెళ్లి కోసం రాజస్థాన్ వ్యక్తికి అమ్మేసినట్లు ఆ అమ్మాయి చెప్పింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 12న ఆమె మరణించింది.
మరోవైపు చాలా దయనీయ స్థితిలో ఆ బాలిక మరణించడంపై పోలీసులు స్పందించారు. ఇంటి నుంచి ఆమె పారిపోయినప్పటికీ కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం, మిస్సింగ్ కేసు నమోదు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. బాలిక మరణంపై కేసు నమోదు చేశారు. ఆమె తల్లిదండ్రులతోపాటు ఇతరులు క్రూరత్వంగా ప్రవర్తించి వదిలేశారా? ఆమె అనారోగ్యానికి కారణమయ్యారా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Nomination Papers | శ్మశానవాటికలో నేత.. నామినేషన్ పత్రాలు అక్కడ అందజేసిన పార్టీ
Father Dead, Daughter Starving | ఆకలి బాధతో తండ్రి మృతి.. కృశించిన శరీరంతో కుమార్తె
Watch: జ్యుయలరీ షాపులో పట్టపగలే చోరీ.. రూ.4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోపిడీ