లక్నో: భార్య మరణం తర్వాత కుమార్తె సంరక్షణ కోసం దంపతులను ఒక వ్యక్తి నియమించాడు. అయితే ఆ వ్యక్తిని, అతడి కుమార్తెను గదుల్లో వారు బంధించారు. సరిగా ఆహారం ఇవ్వకుండా కడుపుమాడ్చారు. ఈ నేపథ్యంలో ఆకలి బాధతో ఆ వ్యక్తి మరణించాడు. కృశించిన శరీరంతో ఉన్న కుమార్తెను బంధువులు గుర్తించారు. (Father Dead, Daughter Starving) ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. 70 ఏళ్ల ఓంప్రకాష్ సింగ్ రాథోడ్ సీనియర్ రైల్వే క్లర్క్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. 27 ఏళ్ల కుమార్తె రష్మి మానసిక వికలాంగురాలు.
కాగా, 2016లో ఓం ప్రకాష్ సింగ్ భార్య మరణించింది. దీంతో తనతోపాటు కుమార్తె రష్మి సంరక్షణ కోసం రామ్ ప్రకాష్ కుష్వాహా, రాందేవి దంపతులను ఆయన నియమించాడు. అయితే ఓంప్రకాష్ వృద్ధాప్యం, అతడి కుమార్తె మానసిక పరిస్థితిని కేర్‌టేకర్స్ తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. ఓం ప్రకాష్, అతడి కుమార్తెను కింది గదుల్లో నిర్బంధించారు. పై అంతస్తులో వారు హాయిగా నివసిస్తున్నారు. ఆ ఇంటికి బంధువులు వచ్చినప్పుడల్లా ఓంప్రకాష్ ఎవరినీ కలవడానికి ఇష్టపడటం లేదని చెప్పేవారు.
మరోవైపు ఓం ప్రకాష్ మరణించినట్లు సోదరుడు, బంధువులకు సోమవారం తెలిసింది. దీంతో వారు ఆ ఇంటికి చేరుకున్నారు. ఆయన మృతదేహం పూర్తిగా కృశించిపోయి ఉండటం చూసి షాకయ్యారు. ఆసుపత్రికి తరలించగా ఆకలి బాధతో అతడు మరణించినట్లు తెలుసుకున్నారు.
కాగా, ఓం ప్రకాష్ 27 ఏళ్ల కుమార్తె రష్మి కూడా 80 ఏళ్ల మహిళగా కనిపించింది. ఆమె శరీరం కూడా కృశించుపోయింది. కేవలం ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఓంప్రకాష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. చావు అంచుల్లో ఉన్న కుమార్తె రష్మీని బంధువులకు అప్పగించారు.
అయితే ఒకప్పుడు దర్జాగా బతికిన వారిద్దరిని సంరక్షకులైన రామ్ ప్రకాష్, రాందేవి ఆకలితో మాడ్చి చిక్కిశల్యం చేశారని సోదరుడు, బంధువులు ఆరోపించారు. ఓం ప్రకాష్‌ను ఆకలి బాధతో చంపిన ఆ దంపతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Also Read:
mother kills daughter | హిందీ మాట్లాడుతున్నదని.. కుమార్తెను హత్య చేసిన తల్లి
Man Harassing Woman | మాల్లో మహిళ పట్ల అసభ్యకర ప్రవర్తన.. డెలివరీ మ్యాన్ అరెస్ట్
Teens Attack Migrant Worker | వలస కార్మికుడిపై కత్తులతో దాడి.. విక్టరీ చిహ్నంతో యువకుల పోజులు
Watch: జ్యుయలరీ షాపులో పట్టపగలే చోరీ.. రూ.4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోపిడీ