శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 10, 2020 , 07:57:51

కాన్పూర్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే హతం

కాన్పూర్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే హతం

కాన్పూర్‌: గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఉత్తరప్రదేశ్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. కరడుగట్టిన నేరస్తుడు వికాస్‌ దూబే నిన్న ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో పోలీసులకు చిక్కాడు. అక్కడి నుంచి భారీ భద్రతతో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కాన్పూర్‌కు తరలిస్తున్నారు. కాన్వాయ్‌లోని ఓ కారు కాన్పూర్‌ సమీపంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఇదే అదనుగా భావించిన దూబే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. అతని మృతదేహాన్ని కాన్పూర్‌ దవాఖానకు తరలించారు.   

భారీ వర్షం కురుస్తుండటంతోపాటు రోడ్డు సరిగా లేకపోవడంతో కారు ప్రమాదానికి గురై బోల్తా పడిందని ఎస్టీఎఫ్‌ పోలీసులు చెప్పారు. కారు బోల్తా పడగానే వికాస్‌ దూబే పారిపోవడానికి ప్రయత్నించాడని, దీంతో పోలీసులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. 

కరడుగట్టిన గ్యాంగ్‌స్టార్‌ వికాస్‌ దూబేను అరెస్టు చేయడానికి డీఎస్పీ దేవేంద్ర మిశ్రా నేతృత్వంలో పోలీసులు కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామానికి జూన్‌ 3న వెళ్లారు. అరెస్టుకు సంబంధించి అప్పటికే సమాచారం అందడంతో దూబే ముఠా సభ్యులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దూబే అప్పటి నుంచి తప్పించుకుతిరుగుతున్నాడు.  
జూలై 5న హర్యానాలోని ఓ హోటల్‌లో దూబే ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. అయితే పోలీసులు వెళ్లేలోపే అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బుధవారం రాత్రి (జూలై 8) ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆటోలో వెళ్తూ తనకు కన్పించాడని ఒక ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో గ్యాంగ్‌స్టార్‌ కోసం గాలింపు చేపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. కాగా, గురువారం ఉదయం మధ్యప్రదేశ్‌లో ప్రత్యక్షమైన దూబే.. ఉజ్జయినీలోని మహాకాలేశ్వరుని దర్శనం కోసం ఆలయానికి వచ్చాడు. అక్కడ ఓ కానిస్టేబుల్‌ దూబేను గుర్తించడంతో వారం రోజుల తర్వాత పోలీసులకు చిక్కాడు. ఉజ్జయినీ నుంచి కాన్పూర్‌ తీసుకువస్తుండగా శుక్రవారం ఉదయం పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. దూబేపై బీజేపీ ఎమ్మెల్యే హత్యసహా 60 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 


logo