న్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది, మిజోరం మాజీ గవర్నర్, దివంగత సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ (Swaraj Kaushal) గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. పలువురు నేతలు ఆయన అంత్యక్రియల్లో పాల్గొని నివాళి అర్పించారు. కుమార్తె, బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ సోషల్ మీడియా పోస్ట్‌లో తన తండ్రికి నివాళి అర్పించారు. ‘మీ ఆప్యాయత, క్రమశిక్షణ, సరళత, మీ దేశభక్తి, అపరిమితమైన ఓర్పు నా జీవితానికి వెలుగు. అవి ఎప్పటికీ మసకబారవు. మీ నిష్క్రమణ నన్నెంతో బాధిస్తున్నది. దేవుని సన్నిధిలో శాంతియుతంగా ఉన్న తల్లితో మీరు తిరిగి కలిశారని నా మనస్సు నమ్ముతున్నది’ అని పేర్కొన్నారు.
కాగా,1952 జూలై 12న హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో స్వరాజ్ కౌశల్ జన్మించారు. ఢిల్లీ, చండీగఢ్‌లో చదువుకున్నారు. ప్రముఖ క్రిమినల్ న్యాయవాది అయిన ఆయన 1975-77 అత్యవసర పరిస్థితి సమయంలో బరోడా డైనమైట్ కేసు విచారణలో సోషలిస్ట్ నేత జార్జ్ ఫెర్నాండెజ్ తరపున వాదించడం ద్వారా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. 1986లో మిజోరం శాంతి ఒప్పందంపై సంతకం చేయడంలో కీలక పాత్ర పొషించారు. 20 సంవత్సరాల తిరుగుబాటును ముగించారు. 1987లో మిజోరం తొలి అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. 1990-93 మధ్య మిజోరం గవర్నర్‌గా పనిచేశారు.
మరోవైపు1998-2004 మధ్య హర్యానా రాష్ట్రానికి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించారు. హర్యానా వికాస్ పార్టీ నేత అయిన ఆయన 1998-99, 2000-2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
కాగా, 1975లో సుష్మాను స్వరాజ్ కౌశల్ వివాహం చేసుకున్నారు. అయితే 2019 ఆగస్ట్ 6న గుండెపోటుతో ఆమె మరణించారు. వారి ఏకైక కుమార్తె బన్సూరి స్వరాజ్. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ లోక్‌సభ సభ్యురాలిగా ఆమె ఉన్నారు.
Also Read:
Watch: 140కుపైగా వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎందుకంటే?
Watch: వృద్ధురాలి చెంపపై కొట్టిన మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్