Vande Bharat sleeper | రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నట్లు ప్రకటించింది. తొలి రైలు గౌహతి-కోల్‌కతా (Guwahati to Kolkata) మధ్య అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) గురువారం ప్రకటించారు. ఈ రైలు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జెండా ఊపి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
విలేకరు సమావేశంలో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘వందే భారత్ స్లీపర్ రైలు టెస్ట్ డ్రైవ్ పూర్తైంది. త్వరలో ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. తొలి రైలు గౌహతి-కోల్‌కతా మధ్య అందుబాటులోకి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ మార్గంలో వందే భారత్ స్లీపర్ రైలు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. వందే భారత్ స్లీపర్.. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మెరుగైన భద్రత, రాత్రిపూట సుదూర ప్రయాణాలకు ఆధునిక ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది’ అని తెలిపారు. జనవరి 18-19 తేదీల్లో ఈ ప్రారంభోత్సవం ఉండొచ్చని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
వందేభారత్ స్లీపర్@182 Kmph
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ (Vande Bharat) రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. 2019లో ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలో రైల్వేశాఖ స్లీపర్ వర్షన్ (Vande Bharat Sleeper) అందుబాటులోకి తెచ్చింది. ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ రైలుకు ట్రయల్ రన్స్ చేపడుతున్నారు. రైలు వేగాన్ని పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రాజస్థాన్ కోటా-నాగ్దా సెక్షన్ల (Kota Nagda section) మధ్య ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్ విజయవంతమైనట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పరీక్షల్లో (During Trials) రైలు గరిష్ఠంగా గంటకు 182 కిలోమీటర్ల వేగాన్ని (180kmph Speed) అందుకుంది. ఈ హైస్సీడ్లో వాటర్ టెస్ట్ కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఎక్స్ వేదికగా షేర్ చేశారు. రైలు హైస్పీడ్‌తో దూసుకెళ్తున్నప్పటికీ నీళ్లతో నిండుగా ఉన్న గ్లాసులు మాత్రం తొణకకుండా స్థిరంగా ఉన్నట్టు వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Vande Bharat Sleeper tested today by Commissioner Railway Safety. It ran at 180 kmph between Kota Nagda section. And our own water test demonstrated the technological features of this new generation train. pic.twitter.com/w0tE0Jcp2h
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 30, 2025
ప్రత్యేకతలు..
వందే భారత్ స్లీపర్ రైలుకు చాలానే ప్రత్యేకలున్నాయి. విమానం తరహాలో ప్రయాణికులు ఈ రైలులో సౌకర్యాలుంటాయి. ఈ రైలు ముందు విలాసవంతమైన హోటల్స్ సైతం దిగదుడుపేనని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రైలు గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నది. వందే భారత్ స్లీపర్ రైలులో ఒకేసారి 823 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఒక ఫస్ట్ ఏసీ కోచ్, నాలుగు సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి.
వందేభారత్ రైలును గంటకు 160 నుంచి 200 కి.మీ. స్పీడ్‌తో వెళ్లేలా తయారుచేశారు. దాంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనున్నది. రైలులో ఫైర్ సేఫ్టీతో పాటు ప్రతి బెర్త్ వద్ద అత్యవసర స్టాప్ బటన్స్ సైతం ఉంటాయి. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు బెర్తులను మెరుగైన కుషన్‌తో ఏర్పాటు చేశారు. అప్పర్ బెర్తులు ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు. దాంతో ప్రయాణికులకు సరికొత్త అనుభవాన్ని అందించనున్నాయి. అలాగే, రైలులో అత్యాధునిక సేవలు అందించనున్నారు. బయో వాక్యూమ్ టాయిలెట్లు, టచ్ ఫ్రీ ఫిట్టింగ్‌లు, షవర్ క్యూబికల్స్, ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత డిస్ప్లేలు, ఛార్జింగ్ సాకెట్లు వంటి సౌకర్యాలు ఈ మరింత ఆకర్షణీయంగా ఏర్పాటు చేస్తున్నది.
టాయిలెట్లో ఎలాంటి బటన్ నొక్కకుండానే నీళ్లు వస్తాయి. ఒక కోచ్ నుంచి మరో కోచ్‌లోకి వెళ్లేందుకు ఆటో మేటిక్ డోర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ సైతం ఉంటుంది. ప్రతి కోచ్‌లోనూ సీసీ కెమెరాలు ఉంటాయి. చార్జింగ్ పెట్టుకునేందుకు ప్రతి బెర్త్ వద్ద సాకెట్ ఉంటుంది. అలాగే, బెర్త్ వద్ద చిన్న లైట్ సైతం ఉంటుంది. దాంతో ఎవరైనా బుక్‌లు, పేపర్ చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. సేఫ్టీ ‘కవచ్’ సిస్టమ్, బ్లాట్ ప్రూఫ్ బ్యాటరీ, 3 గంటల ఎమర్జెన్సీ బ్యాకప్ ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తాయని రైల్వేశాఖ పేర్కొంది. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లలో కోచ్‌ల సంఖ్య దాదాపు 16-20 మధ్య ఉంటుంది.
Also Read..
Air India | విమానం టేకాఫ్‌కు ముందు పైలట్ వద్ద మద్యం వాసన.. అరెస్ట్
LPG cylinder | కొత్త ఏడాది బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
Nitish Kumar | రూ.1.48 కోట్ల ఫ్లాట్, రూ.20,552 నగదు.. ఆస్తి వివరాలు ప్రకటించిన బీహార్ సీఎం