Nitish Kumar | 2025 ఏడాది ముగింపు సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar) తన ఆస్తి వివరాలను వెల్లడించారు (Nitish Kumar discloses assets). సీఎంతోపాటూ క్యాబినెట్ మంత్రులు కూడా తమ ఆస్తులను ప్రకటించారు. ఈ వివరాలను క్యాబినెట్ సెక్రటేరియట్ విభాగం తాజాగా విడుదల చేసింది.
ఆ వివరాల ప్రకారం.. సీఎం నితీశ్ కుమార్కు ద్వారకలోని బీహార్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఓ ఫ్లాట్ ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1.48 కోట్లు. ఇక తన వద్ద రూ.20,552 నగదు ఉన్నట్లు సీఎం తెలిపారు. అంతేకాదు సీఎం మూడు బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పాట్నా సెక్రటేరియట్ ఖాతాలో రూ. 27,217, ఢిల్లీలోని తన ఎస్బీఐ పార్లమెంటరీ హౌస్ ఖాతాలో రూ.3,358, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఖాతాలో రూ.27,191 నగదు ఉన్నట్లు సీఎం వెల్లడించారు. ఇక తన వద్ద రూ.11,32,753 విలువ చేసే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు, రూ.2.03 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన మొత్తం చరాస్తుల విలువ రూ.17,66,196. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా సహా పలువురు మంత్రులుకూడా తమ ఆస్తి వివరాలను బహిర్గతం చేశారు.
ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి (Samrat Chaudhary).. తన వద్ద రూ.1.35 లక్షల నగదు, తన భార్య వద్ద రూ.35,000 నగదు ఉన్నట్లు ప్రకటించారు. వీటితోపాటూ పలు బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ రూపంలో రూ.లక్షల్లో ఉన్నట్లు తెలిపారు. వాటిలో ఎస్బీఐ ఖాతాలో రూ.15,35,789, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలో రూ.2,09,688 ఉన్నట్లు వివరించారు. బాండ్లు, షేర్లలో కూడా పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. భార్య, కుమార్తె, కొడుకు పేర్లపై బ్యాంకు డిపాజిట్లు కూడా ఉన్నాయి.
ఇక సామ్రాట్ చౌదరి వద్ద రూ.7 లక్షల విలువైన 2023 మోడల్ బొలెరో నియో ఉంది. తన భార్య వద్ద, తన వద్ద కలిసి రూ.40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, పాట్నాలోని గోలా రోడ్డులో తన భార్య పేరుమీద రూ.29 లక్షల విలువైన ఫ్లాట్ ఉంది. ఇక సామ్రాట్ చౌదరి వద్ద రూ.4 లక్షల విలువైన ఎన్పీ బోర్ రైఫిల్, ఆయన తండ్రి ఇచ్చిన రూ.2 లక్షల విలువైన రివాల్వర్ కూడా ఉన్నాయి.
మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ( Vijay Kumar Sinha).. తన వద్ద రూ.88,560 నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.55 లక్షలకుపైగా సేవింగ్స్ ఉన్నట్లు ప్రకటించారు. శివ బయోజెనెటిక్, పవర్ గ్రిడ్ వంటి కంపెనీల్లో షేర్లు సహా ఇతర సంస్థల్లో పెట్టుబడులు, రూ.9.90 లక్షల విలువైన 90 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు ప్రకటించారు. పలువురు మంత్రులు కూడా ఆస్తి వివరాలను ప్రకటించారు.
Also Read..
PM Modi | అద్భుతమైన సంవత్సరం కావాలి.. దేశ ప్రజలకు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
New Year 2026 | కొత్త ఏడాది.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. VIDEOS
Snow Fall | కశ్మీర్ వ్యాలీపై విపరీతంగా మంచు.. గడ్డ కట్టే చలిలోనూ గస్తీ కాస్తున్న సైనికులు.. VIDEOS