మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 15:41:04

ముగిసిన క్వాడ్‌ మలబార్ నౌకా విన్యాసాలు

ముగిసిన క్వాడ్‌ మలబార్ నౌకా విన్యాసాలు

న్యూఢిల్లీ : మలబార్‌ నౌకా విన్యాసాల 24 వ ఎడిషన్‌ శనివారం ముగిసింది. నవంబర్ 3 న ప్రారంభమైన ఈ వ్యాయామంలో భారత్‌తోపాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నావికాదళాలు పాల్గొన్నాయి. ఆస్ట్రేలియా నావికాదళం తొలిసారిగా క్వాడ్‌ మలబార్‌ విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నది. పశ్చిమ బంగాళాఖాతంలో నిర్వహించిన వ్యాయామాలు శనివారంతో ముగిశాయి. ఇండో, పసిఫిక్, నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమాన్ని బలోపేతం చేయడం, ప్రోత్సహించడం ఈ నౌకాదళ విన్యాసాల ప్రధాన ఉద్దేశం.

మలబార్ 2020 యొక్క రెండవ దశ ఈ నెలాఖరులో అరేబియా సముద్రంలో నిర్వహించనున్నారు. నాలుగు క్వాడ్ దేశాలు అయిన భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా.. 2007 తరువాత ఈ వ్యాయామంలో పాల్గొనడం ఒక దశాబ్ద కాలం తర్వాత ఇదే మొదటిసారి. ఈ వ్యాయామం సముద్ర దశకే పరిమితం చేశారు.  కొవిడ్‌-19 ను పరిగణనలోకి తీసుకొని ‘జీరో కాంటాక్ట్’ ఆకృతిలో విన్యాసాలను నిర్వహించారు. 

మలబార్ 2020 యొక్క మొదటి దశ విన్యాసాల్లో యునైటెడ్ స్టేట్స్ షిప్ (యూఎస్ఎస్) జాన్ ఎస్ మెక్కెయిన్ (గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్), హర్ మెజెస్టి యొక్క ఆస్ట్రేలియన్ షిప్ (హెచ్‌ఎంఏఎస్) బల్లారట్ (దీర్ఘ శ్రేణి యుద్ధనౌకలు) తో ఎంహెచ్‌ 60 హెలికాప్టర్‌తో భారత నావికాదళ యూనిట్లు పాల్గొన్నాయి. ఎస్‌హెచ్‌ 60 హెలికాప్టర్‌తో జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ షిప్ (జేఎంఎస్‌డీఎఫ్‌) ఓనామి (డిస్ట్రాయర్) కూడా పాల్గొన్నాయి.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.