Economic Survey | కేంద్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ మూడోసారి సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. శనివారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్‌ను సమర్పించనుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను ముందస్తుగా తెలిపేందుకు ఆర్థిక సర్వే (Economic Survey)ను పార్లమెంట్‌కు సమర్పించనుంది.
మరికాసేపట్లో ఉభయసభల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో, 2 గంటలకు రాజ్యసభలో ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టబోతున్నారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టే ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఎకనమిక్ డివిజన్ సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పర్యవేక్షణలో ఈ ఆర్థిక సర్వే తయారు చేశారు.
గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్ రూపకల్పన ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వశాఖ రూపొందించే ఈ సర్వే రానున్న రోజుల్లో దేశం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ముందుగానే అంచనా వేసి పలు సూచనలను చేస్తుంది.
దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. కేవలం దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేయడమే కాకుండా.. ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల వంటి అంశాలను కూడా వివరిస్తుంది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల కలుగుతున్న ఫలితాలను కూడా విశ్లేషిస్తుంది.
బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. 1950-51 నుంచి యూనియన్ బడ్జెట్ తోపాటు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెట్టే వారు. అయితే, 1960వ దశకం నుంచి కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెడుతున్నారు.
Also Read..
Budget session | కుంభమేళా తొక్కిసలాట బాధితులకు పార్లమెంట్ సంతాపం
Budget session | పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
PM Modi | దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుంది : ప్రధాని మోదీ