PM Modi | పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Budget session) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంపీలంతా పార్లమెంట్‌కు చేరుకున్నారు. సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. మూడోసారి ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టారని.. పార్లమెంట్లో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కృప ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. భారత శక్తి సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపునిస్తాయన్నారు. ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందన్నారు.
ఈ బడ్జెట్ వికసిత్ భారత్‌కు ఊతం ఇస్తుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ (Viksit Bharat) 2047 లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇన్నోవేషన్, ఇన్‌క్లూజన్, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంతో దూసుకెళ్తున్నట్లు చెప్పారు. కొత్త విధానాలపైనే ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందని మోదీ వివరించారు. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరిగేలా సభ్యులు సహకరించాలని, బిల్లులకు విపక్షాలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. వక్ఫ్(సవరణ) బిల్లు, బ్యాంకింగ్ చట్టాల(సవరణ) బిల్లు, రైల్వే(సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ(సవరణ) బిల్లుతో పాటు వలస, విదేశీయుల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ నేపథ్యంలో గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటరీ కమిటీల్లో మెజార్టీని ఉపయోగించి అజెండాను కేంద్రం బలవంతంగా రుద్దుతున్నదని విపక్షాలు ఆరోపించాయి.
Also Read..
Parliament Budget Session | నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..
Union Budget 2025 | విద్యా ఉపాధి రంగానికి కేటాయింపులు పెంచుతారా..? బడ్జెట్‌పై ఆశలు ఎన్నో..!
Maha Kumbh Mela | త్రివేణీ సంగమంలో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు