Parliament Budget Session | న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయసభల్లో ఆర్థిక సర్వేను, శనివారం లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. మహాకుంభమేళాలో తొక్కిసలాట అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని విపక్షాలు నిర్ణయించాయి. అయితే, ఏయే అంశాలపై చర్చించాలనేది బీఏసీ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.
కాగా, జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. వక్ఫ్(సవరణ) బిల్లు, బ్యాంకింగ్ చట్టాల(సవరణ) బిల్లు, రైల్వే(సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ(సవరణ) బిల్లుతో పాటు వలస, విదేశీయుల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ నేపథ్యంలో గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటరీ కమిటీల్లో మెజార్టీని ఉపయోగించి అజెండాను కేంద్రం బలవంతంగా రుద్దుతున్నదని విపక్షాలు ఆరోపించాయి.