Union Budget 2025 | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 11వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. కేంద్ర రాబోయే బడ్జెట్లో విద్య, ఉపాధి రంగానికి భారీగా కేటాయింపులు చేస్తారని ఆశిస్తున్నారు. ఈ రెండు రంగాలు దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాకుండా సాధారణ పౌరుడి జీవనశైలిని సైతం ప్రభావితం చేస్తాయి. విద్య, ఉపాధి రంగాలకు సంబంధించి బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తున్నారో ఓసారి తెలుసుకుందాం..!
దేశవ్యాప్తంగా విద్యార్థులు, పరిశోధకులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సైతం సాధారణ బడ్జెట్‌పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. మోదీ సర్కారు గత కొద్ది సంవత్సరాలుగా విద్య, ఉపాధి, నైపుణాభివృద్ధికి బడ్జెట్‌ను పెంచుతూ వచ్చింది. 2024లో ఈ రంగానికి రూ.1.48లక్షల కోట్లు కేటాయించింది. అందులో అత్యధికంగా రూ.73,498 కోట్లు పాఠశాల విద్య, అక్షరాస్యత కోసం కేటాయించింది. గత బడ్జెట్లో ఉన్నత విద్య కోసం రూ.10లక్షల వరకు రుణాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ పథకాన్ని 2024 నవంబర్ 6న మంత్రివర్గం ఆమోదించింది. ఇందు కోసం కొత్తగా పోర్టల్‌ను సైతం సిద్ధం చేసింది. స్కీమ్‌లో విద్యార్థులకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకు రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం దాదాపు 22లక్షల మంది విద్యార్థులు రుణం ఇవ్వనున్నది.
పరిశోధనలతో పాటు ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. నవంబర్ 2024లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకుల కోసం ‘వన్ నేషన్ – వన్ సబ్స్క్రిప్షన్’ (ONOS) పేరు కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకంలో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 6300 ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలలోని 1.8 కోట్ల మంది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు మరియు శాస్త్రవేత్తలకు ప్రయోజనం చేకూరనున్నది. రూ.6వేలకోట్ల భారీ బడ్జెట్‌ను స్కీమ్‌కు కేటాయించింది. ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్‌తో పాటు స్వయంప్రతిపత్తి కలిగిన యూజీసీ ఇంటర్-యూనివర్సిటీ సెంటర్లతో సమన్వయం చేస్తారు. వికసిత్ భారత్, జాతీయ విద్యా విధానం -2020, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ లక్ష్యాల సాధనలో ఉపయోగపడనున్నది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని విద్యార్థులు.. అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలకు ఈ స్కీమ్ ద్వారా స్కాలర్ ప్రచురణలకు యాక్సెస్ లభిస్తుంది. ఈ పథకం మొత్తం డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీలు సులువుగా ఈ పథకం లబ్దిని పొందేలా చూడడంతో పాటు ఈ పథకంతో దేశవ్యాప్తంగా విద్యారంగంలో రీసెర్చ్, ఆవిష్కరణలు మెరుగవుతాయని కేంద్రం ఆశిస్తున్నది.
ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు బడ్జెట్ గురించి తమ విజ్ఞప్తులు కేంద్రమంత్రి ముందుంచారు. ఈ బడ్జెట్లో విద్యారంగానికి ప్రత్యేక కానుకలు ఆశిస్తున్నట్లుగా తెలిపారు. దాంతోనే తాము చదువు‘కొనే’ పరిస్థితి తప్పుతుందని.. ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువులను పూర్తి చేసుకోగలుగుతామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గత కొద్ది సంవత్సరాలుగా బడ్జెట్లో విద్య, ఉన్నత విద్యకు కేటాయింపులు పెరిగాయి. అభివృద్ధి చెందుతున్న ఉపాధిరంగం, డిజిటిల్ యుగం డిమాండ్లను తీర్చేందుకు మరింత కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నాణ్యమైన విద్యను అందించడం వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)ని పెంచవడం అవసరమని చెబుతున్నారు.
ఈ సారి కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్రం ఎడ్యుకేషన్ డిజిటలైజేషన్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహమ్మారి తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్ విధానం పెరిగింది. ఈ క్రమంలో డిజిటల్ విద్యకు బడ్జెట్లో కేటాయింపులు పెంచుతుందని భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యారంగం మెరుగునకు ప్రయత్నాలు జరిగాయి. ఈసారి కేంద్ర బడ్జెట్లో కొత్త జాతీయ విద్యా విధానం (NEP 2020)ను మరింత ప్రభావవంతంగా చేసేందుకు చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
ఉపాధి రంగానికి ఈ సారి కొత్త కార్యక్రమాలు, పథకాలను ప్రకటించే అవకాశాలున్నాయి. కేంద్ర బడ్జెట్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (SMES) ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తారని భావిస్తున్నారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందించేందుకు ఛాన్స్ ఉంది. నిరుద్యోగాన్ని తగ్గించేందుకు చిన్న వ్యాపారాలు రుణం, ఆర్థిక సహాయ సౌకర్యాలను అందించేందుకు చాన్స్ ఉంది. యువత ఉపాధి పొందగలిగేలా ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగుల కోసం కేంద్ర బడ్జెట్లో కొత్త పథకాలను ప్రారంభించేందుకు అవకాశం ఉన్నది. ఇందులో ఉద్యోగ మేళాలు నిర్వహించడం, ప్రత్యేక ఉద్యోగ శిక్షణ కోసం ఏమైనా కేటాయింపులు చేస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాగే ఈ బడ్జెట్లో స్టార్టప్‌లు, ఎంటర్ప్రెన్యూయర్స్షిప్ కోసం కొత్త పథకాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. తద్వారా కొత్త సంస్థలను ప్రోత్సహించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెంచనున్నది.
Budget 2025 | రేపే కేంద్ర బడ్జెట్.. ట్యాక్స్‌పేయర్స్‌కు ఊరట లభించేనా?
Budget 2025-26 | ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఈ సవాళ్లు..!