Budget 2025 | న్యూఢిల్లీ, జనవరి 30: మరికొద్ది గంటల్లో కేంద్ర బడ్జెట్ ఆవిష్కృతం కానున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను పార్లమెంట్లో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఎప్పట్లాగే ఈసారీ సమాజంలోని ఆయా వర్గాలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకం, సగటు ఉద్యోగులు పద్దుపై బోలెడు ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. ప్రధానంగా వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి ఊరటనివ్వాలని పెద్ద ఎత్తున కోరుతున్నారు. మరి వాటిని మోదీ సర్కారు ఏ మేరకు నెరవేరుస్తుందో చూడాలి. ఇక రాబో యే బడ్జెట్పైనున్న టాప్-10 అంచనాలివే..
కొత్త, పాత వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) విధానాల్లో శ్లాబులు, రేట్లను మార్చాలని ట్యాక్స్‌పేయర్స్ కోరుకుంటున్నారు. అయితే ఐదేండ్ల కిందట కొత్త ఆదాయ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన మోదీ సర్కారు.. అప్పట్నుంచి పాత ఆదాయ పన్ను విధానం జోలికే వెళ్లడం లేదు. కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికే ప్రతీ బడ్జెట్లో సవరణలు చేస్తూ వస్తున్నది. దీంతో ఈసారి కొత్తదానిలో వార్షిక ఆదాయం రూ.20 లక్షలు, అంతకుమించి ఉంటేనే 30 శాతం పన్ను వేయాలన్న డిమాండ్లు భారీగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను పడుతున్నది. అలాగే రూ.12-15 లక్ష ల శ్లాబుపై వర్తిస్తున్న 20 శాతం పన్నును 15 శాతానికి కుదించి.. కొత్తగా రూ.10-15 లక్షల శ్లాబును తీసుకురావాలని కోరుతున్నారు.
కొత్త ఆదాయ పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను లక్ష రూపాయలకు పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. పెంచితే మరింత మంది ట్యాక్స్‌పేయర్స్ కొత్త విధానంలోకి వచ్చే వీలుందని నిపుణులూ చెప్తున్నారు. ఇక కిందటి బడ్జెట్లో రూ.50వేల నుంచి రూ.75వేలకు పెంచిన విషయం తెలిసిందే. మరోవైపు పాత పన్ను విధానంలోనూ స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75వేలకు పెంచాలన్న డిమాండ్లు వస్తున్నాయి.
కొత్త ఆదాయ పన్ను విధానంలో ఇప్పుడు వార్షిక ఆదాయం రూ.3 లక్షలదాకా ఉంటే ఎలాంటి పన్ను లేదు. అయితే దీన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పాత ఆదాయ పన్ను విధానంలోనూ ఈ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ.2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వ్యక్తిగతంగా పన్ను సహిత ఆదాయం ఏటా రూ.7 లక్షలదాకానే ఉంటే పూర్తిగా ట్యాక్స్ రిబేటుకు వీలుంటున్నది. అయితే దీన్ని ఈసారి బడ్జెట్లో రూ.10 లక్షలకు పెంచాలని ట్యాక్స్‌పేయర్స్ కోరుతున్నారు. కొత్త ఆదాయ పన్ను విధానంలో రావాలని కోరుతున్న ఈ మార్పుతో మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఊరట లభిస్తుందని చెప్తున్నారు. వినిమయ శక్తి కూడా పెరిగి మార్కెట్‌కు కొత్త ఉత్సాహం వస్తుందనీ నిపుణులు పేర్కొంటున్నారు.
కొత్త ఆదాయ పన్ను విధానంలోనూ పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రయోజనాలను తేవాలని పలువురు ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ప్రస్తుతం పాత ఆదాయ పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద ఏటా గరిష్ఠంగా రూ.1.5 లక్షలదాకా పన్ను మినహాయింపులను ట్యాక్స్‌పేయర్స్ క్లెయిం చేసుకోవచ్చన్న సంగతి విదితమే. ఇదిలావుంటే దీన్ని రూ.2 లక్షలకు పెంచాలని పాత ఆదాయ పన్నును ఎంచుకొంటున్నవారూ డిమాండ్ చేస్తున్నారు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)ను మరింత మంది ఎంచుకొనేలా ఈ బడ్జెట్లో పలు నిర్ణయాలు, ప్రోత్సాహకాలు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి పూర్తిగా పన్ను మినహాయింపును కల్పించవచ్చని, పాత ఆదాయ పన్ను విధానంలో ఉన్నట్టుగానే.. కొత్త ఆదాయ పన్ను విధానంలోనూ ఎన్పీఎస్కు రూ.50వేలదాకా అదనపు పన్ను ప్రయోజనాలను కల్పించవచ్చని చెప్తున్నారు.
మెట్రోపాలిటన్ ప్రాంతాలకుతోడు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉంటున్నవారికీ హౌజ్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) ప్రయోజనాలు అందేలా ఈసారి బడ్జెట్లో చర్యలుంటాయని అంచనా. బేసిక్ సాలరీలో 40 శాతానికి బదులుగా 50 శాతానికి హెచ్ఆర్ఏ మినహాయింపుల్ని పెంచవచ్చని చెప్తున్నారు.
పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఆరోగ్య బీమా ప్రీమియంలూ పెరిగిపోతున్నాయి. సమగ్ర కవరేజీ కోసం మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి పాలసీదారులకు వచ్చింది. దీంతో కొత్త ఆదాయ పన్ను విధానంలో ఆరోగ్య బీమా కోసం చేసే ప్రీమియం చెల్లింపులపై ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద ఉండే ప్రయోజనాలను వర్తింపజేయాలని కోరుతున్నారు.
స్వచ్చంధ సంస్థలకు విరాళాలు పెరిగేలా, బ్యాంకుల్లో పొదుపును ప్రోత్సహించేలా ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80జీ/సెక్షన్ 80టీటీఏ ప్రయోజనాలను కొత్త ఆదాయ పన్ను విధానంలోనూ అమలుపర్చవచ్చని అంచనా.
నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా స్థిరాస్తి కొనుగోలుదారులకు వివిధ రకాల పన్ను ప్రయోజనాలను బడ్జెట్లో ప్రకటిస్తారని అంచనాలున్నాయి. ఇందులో భాగంగానే గృహ రుణగ్రహీతలకు అసలు, వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపులను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏటా రూ.2 లక్షలదాకా పన్ను ప్రయోజనాలను ట్యాక్స్‌పేయర్స్ క్లెయిం చేసుకోవచ్చు. అయితే దీన్ని రూ.3 లక్షలకు పెంచవచ్చని అంటున్నారు. అలాగే ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చని కూడా చెప్తున్నారు.
ప్రస్తుతం దేశంలోని ట్యాక్స్‌పేయర్లలో 78 శాతం కొత్త ఆదాయ పన్ను విధానాన్నే ఎంచుకుంటున్నారు. దీంతో పాత ఆదాయ పన్ను విధానాన్ని కోరుకుంటున్న ఆ మిగతా 22 శాతం మందినీ కొత్త విధానంలోకే తెచ్చేందుకు ఈసారీ పాత విధానంలో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని, కొత్తదానిలోనే సవరణలు చేస్తారన్న అంచనాలు నిపుణుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మున్ముందు పాత పన్ను విధానాన్ని పూర్తిగా ఎత్తేసే వీలు కూడా లేకపోలేదన్న అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. కేవలం పాత ఆదాయ పన్ను విధానంలోనే వివిధ సెక్షన్ల కింద రకరకాల ఆదాయ-వ్యయాలకు, పెట్టుబడులు-పొదుపులకు ఇప్పుడు ట్యాక్స్‌పేయర్స్ పన్ను మినహాయింపులను కోరే వెసులుబాటు ఉంటున్న సంగతి విదితమే.
వీ అనంత నాగేశ్వరన్: ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి. భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్నారు.
మనోజ్ గోవిల్: ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి. మధ్యప్రదేశ్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కేంద్ర వ్యయ కార్యదర్శిగా ఉన్నారు.
అజయ్ సేథ్: ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి. బడ్జెట్ డాక్యుమెంట్లకు తుదిరూపునివ్వడంలో నేర్పరి.
తుహిన్ కాంత పాండే: ఆర్థిక, రెవిన్యూ కార్యదర్శి. ఒడిషా కేడర్ ఐఏఎస్ అధికారి.
అరుణిష్ చావ్లా: ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ కార్యదర్శి. బీహార్ కేడర్ ఐఏఎస్ అధికారి.
ఎం నాగరాజు: త్రిపురకు చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆర్థిక సేవల కార్యదర్శిగా ఉన్నారు.