Budget 2025-26 | వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్న ఎనిమిదో బడ్జెట్ ఇది. బడ్జెట్ రూపకల్పనలో ఆర్థికశాఖ కార్యదర్శి తుహిన్ కాంతా పాండేతోపాటు కీలక అధికారులు అవిశ్రాంతంగా పని చేశారు. రూ.50 లక్షల కోట్లపై చిలుకు విలువ గల బడ్జెట్‌ను సిద్ధం చేశారు. అయితే పతనం అవుతున్న ఆర్థిక వృద్ధిరేటు, అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం, వినియోగ డిమాండ్‌లో పెరుగుదల వంటి పలు సవాళ్లను ఈ బడ్జెట్ పరిష్కరించాల్సి ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఆర్థిక వృద్ధిరేటు నాలుగేండ్ల కనిష్టం 6.4శాతానికి పడిపోతుందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక వృద్ధి రేటు నెమ్మదిస్తుందన్న సందేహాలు ఉన్నాయి. 2019-20లో యావత్ ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసిన కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత అతి తక్కువ ఆర్థిక వృద్ధిరేటు నమోదు కావడం ఇదే తొలిసారి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ దశల్లో పలు సవాళ్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించారు. వినియోగం డిమాండ్‌లో మెరుగుదల, ఆర్థిక వృద్ధిరేట్ క్షీణత, భౌగోళిక రాజకీయ అనిశ్చతి, స్తంభించిన ప్రైవేట్ పెట్టుబడులు తదితర సమస్యల నుంచి ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించారు. ఈ నెలలో ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ జీవిత కాల గరిష్టం రూ.86.7లకు పతనమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) జీడీపీలో ద్రవ్యలోటు 4.5 శాతానికి దిగువకు తేవడం సర్కార్ లక్ష్యంగా ఉంది.
కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26 రూపకల్పనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రెవెన్యూ విభాగం కార్యదర్శి పాండే, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్, వ్యయాల కార్యదర్శి మనోజ్ గోవిల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్యదర్శి అరుణిష్ చావ్లా, ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు, ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ చేయూతనిచ్చారు.