Cheetah | కూనో నేషనల్ పార్క్ (Kuno National Park)లో చీతాల (Cheetah) మరణ మృదంగం కొనసాగుతోంది. తాజాగా మరో చీతా మృతి చెందింది. నమీబియా (Namibia) నుంచి తీసుకొచ్చిన నభా (Nabha) అనే ఆడ చీతా మరణించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. నభా వయసు ప్రస్తుతం 8 ఏళ్లుగా తెలిపారు.
వారం రోజుల క్రితం నభా తీవ్రంగా గాయపడినట్లు చీతా ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్ ఉత్తమ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. వేటాడే సమయంలో గాయపడినట్లు చెప్పారు. వారం రోజులుగా చికిత్స అందించామని, అయితే గాయాలు తీవ్రంగా అవ్వడంతో మరణించినట్లు వెల్లడించారు. పోస్ట్మార్టం తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
అంతరించి పోతున్న చీతాలను పరిరక్షించేందుకు ప్రాజెక్ట్ చీతాను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.1952లో చీతాలు (లార్జ్ వైల్డ్ క్యాట్) అంతరించిపోగా 2022 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం పునరుద్ధరణకు పూనుకుంది. ఇందుకోసం రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నది. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా.. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు దఫాలుగా భారత్కు చీతాలను తీసుకొచ్చారు. వీటిని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో వదిలి సంరక్షణ చర్యలు చేపట్టింది.
అయితే, కొద్ది రోజులకే వివిధ కారణాలతో చీతాలు ఒక్కొక్కటిగా మరణించటం ప్రారంభమైంది. నభా మరణంతో ప్రస్తుతం కూనో పార్క్లో 26 చిరుతలు ఉన్నాయి. వాటిలో తొమ్మిది పెద్దవి (ఆరు ఆడ చీతాలు, మూడు మగ చీతాలు) ఉన్నారు. ఇక కూనో పార్క్లో జన్మించిన 17 కూన చీతాలు ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ ఆరోగ్యంగానే ఉన్నట్లు కూనో పార్క్ అధికారులు తెలిపారు. కూనో పార్క్ నుంచి గాంధీ సాగర్ తరలించిన రెండు మగ చీతలు (ప్రకాశ్, పావక్) కూడా ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు.
Also Read..
CJI BR Gavai: భారతీయ న్యాయ వ్యవస్థను సరిచేయాల్సి ఉంది : సీజేఐ బీఆర్ గవాయ్
Bengaluru Stampede | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. వారే బాధ్యులు : రిపోర్ట్
Building Collapse | కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న నివాసితులు