Bengaluru Stampede | ఐపీఎల్లో తొలి ట్రోఫీ నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించతలపెట్టిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట (Bengaluru Stampede) ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 50 మంది వరకూ గాయపడ్డారు. ఇక ఈ ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ తాజాగా రిపోర్ట్ ( judicial commission report) వెల్లడించింది. ఈ రిపోర్ట్‌ను కమిషన్ సీఎం సిద్ధరామయ్యకు సమర్పించింది.
జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనకు ఆర్సీబీ (RCB), కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ నిర్వాహకులు డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, బెంగళూరు పోలీసులే బాధ్యులని వెల్లడించింది. క్రౌడ్‌ను కంట్రోల్ చేయడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ వారు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారని పేర్కొంది. విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణంగా పేర్కొంది.
ఈ ఘటనలో ప్రణాళిక, సమన్వయం, క్రౌడ్ మేనేజ్మెంట్లో లోపాలపై కమిషన్ దాదాపు నెల రోజుల పాటూ విచారణ జరిపింది. ఘటనాస్థలిని సందర్శించి ప్రత్యక్ష సాక్షులు, పోలీసు అధికారులు, కేఎస్‌సీఏ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ విచారణలో స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని గుర్తించింది. అంతేకాదు స్టేడియం లోపల 79 మంది పోలీసు సిబ్బంది మాత్రమే ఉన్నారని తెలిపింది. స్టేడియం బయట ఒక్క పోలీసు, చివరికి అంబులెన్స్‌లు కూడా లేవని విచారణలో గుర్తించింది. అంతేకాకుండా, కీలక అధికారులు ఘటనపై తక్షణమే స్పందించడంలో విఫలమయ్యారని విచారణలో తేలింది.
కాగా, పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్‌ని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం గత నెల 4న నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా, సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ముందు జాగత్తగా తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది.
తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తొలుత మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కేఎస్‌సీఏ, డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్పై ఎఫ్ఆర్లు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఇక ఈ ఘటన నేపథ్యంలో బెంగళూరు పోలీస్ కమిషనర్, మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు సహా ఐదుగురు పోలీసు అధికారులను తమ విధుల నుంచి ప్రభుత్వం సప్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే పలువురు అరెస్టయ్యారు.
Also Read..
DK Shivakumar | కుర్చీ పొందడం అంత ఈజీ కాదు.. వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి : డీకే శివకుమార్
Air India Plane Crash | బాధితులకు అండగా ఉంటాం.. ప్రాథమిక నివేదికపై బోయింగ్ స్పందన
Air India Plane Crash | పక్షి ఢీ కొనలేదు.. కుట్ర కోణం లేదు.. ప్రాథమిక నివేదికలో వెల్లడి