DK Shivakumar | కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. కుర్చీ పొందడం అంత సులభం కాదన్నారు (Not Easy Getting A Chair). అవకాశం వచ్చినప్పుడే ఆ కుర్చీ లో కూర్చోవాలని వ్యాఖ్యానించారు.
శుక్రవారం బెంగళూరు న్యాయవాదుల సంఘం నిర్వహించిన కెంపెగౌడ జయంతి వేడుకల్లో పాల్గొన్న డీకే ఈ సందర్భంగా మాట్లాడారు. ‘ఖాళీ కుర్చీలు అందుబాటులో ఉన్నప్పటికీ అందులో కూర్చోని చాలా మంది న్యాయవాదులను నేను ఇక్కడ చూస్తున్నాను. కానీ, మేమందరం మాత్రం ఓ కుర్చీ కోసం తీవ్ర పోరాటాలు చేస్తుంటాం. కుర్చీ పొందడం అంత సులభం కాదు. మీరు అవకాశం వచ్చినప్పుడే ఆ సీట్లో కూర్చోవాలి.. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. మీలో చాలా మంది త్యాగపూరితంగా ఉన్నట్లు అనిపిస్తోంది. మీకు అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోండి’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కర్ణాటకలో ముఖ్యమంత్రి (Karnataka CM) ని కాంగ్రెస్ అధిష్ఠానం మారుస్తుందని, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను సీఎంను చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్వయంగా సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) స్పష్టం చేసినప్పటికీ దీనిపై చర్చ మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో ఐదేండ్ల పాటు పూర్తికాలం తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, డీకేను సీఎంను చేయడానికి పదవి నుంచి దిగిపొమ్మని అధిష్ఠానం తనను అడిగినట్టు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.
‘ఐదేండ్ల పాటు నేనే సీఎంగా ఉంటా. ఈ విషయం నేను ఎప్పుడో స్పష్టం చేశా. జూలై 2న చేసిన ప్రకటనలో కూడా ఇదే విషయం చెప్పా. ఆ రోజు నా పక్కన శివకుమార్ కూడా ఉన్నారు’ అని పేర్కొన్నారు. సీఎం పదవిపై డీకే ఆశపడుతున్న విషయంపై ఆయన మాట్లాడుతూ ‘డీకే కూడా ఈ పదవికి ఆశావహుడే. అందులో ఎలాంటి తప్పూ లేదు. ఆయన కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. కానీ సీఎం కుర్చీ ప్రస్తుతం ఖాళీ లేదు’ అని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తనకు పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు. గాంధీలు సహా కాంగ్రెస్ అగ్ర నాయకుల పూర్తి మద్దతు తనకు ఉందని, వారి మద్దతు లేకుంటే సీఎం పదవిలో కొనసాగి ఉండేవాడిని కాదని సిద్ధరామయ్య తెలిపారు.
Also Read..
CM Siddaramaiah | నాకు హైకమాండ్ నుంచి పూర్తి మద్దతు ఉంది.. సీఎం మార్పుపై సిద్ధరామయ్య
ఐదేండ్లూ నేనే సీఎం ఇవ్వడానికి కుర్చీ ఖాళీ లేదు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
“Karnataka | అవును.. చాలామంది ఎమ్మెల్యేలు డీకే సీఎం కావాలనుకుంటున్నారు : ఎమ్మెల్యే యోగేశ్వర్”