Karnataka | కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పుపై ప్రతిష్టంభణ కొనసాగుతోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్వయంగా సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) స్పష్టం చేసినప్పటికీ దీనిపై చర్చ మాత్రం ఆగడం లేదు. పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే సీఎం మార్పును కోరుకుంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు డీకే శివకుమార్‌కే (DK Shivakumar) ఉందని మరో ఎమ్మెల్యే తాజాగా స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ (MLA CP Yogeshwar) మాట్లాడుతూ.. ‘అవును.. చాలా మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఈ అభిప్రాయంపై ఎలాంటి విభేదాలూ లేవు. ప్రజలు, ఎమ్మెల్యేలంతా అదే కోరుకుంటున్నారు. అయితే, తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికే వదిలేశాం’ అని వ్యాఖ్యానించారు. కాగా, రాష్ట్రంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ‘మార్పు’ కోరుకుంటున్నారంటూ డీకేకి సన్నిహితుడిగా పేరొందిన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ (Iqbal Hussain) ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే. దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు శివకుమార్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.
నాకు వేరే గత్యంతరం లేదు..
కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య పునరుద్ఘాటించిన దరిమిలా తనకు వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిర్వేదంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘నాకు వేరే ప్రత్యామ్నాయం ఏముంది? ఆయన(సీఎం) పక్కన నేను ఉండక తప్పదు.. ఆయనకు మద్దతు ఇవ్వక తప్పదు. అధిష్టానం ఏం చెబితే నేను దాన్ని పాటించాల్సిందే’ అని బుధవారం సిద్ధరామయ్య సమక్షంలోనే విలేకరుల సమావేశంలో డీకే వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
Also Read..
Cuddalore train accident | కడలూరు రైలు ప్రమాద మృతులకు రూ.5లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్
Smriti Irani | టీవీ షోలోకి స్మృతి ఇరానీ రీఎంట్రీ.. అప్పట్లో రూ.1,800 పారితోషికం.. ఇప్పుడెంతంటే..?
Himachal Pradesh | అర్ధరాత్రి విలయం.. 67 మంది ప్రాణాలు కాపాడిన శునకం