Himachal Pradesh | భారీ వర్షాలు, విరిగి పడుతున్న కొండచరియలు, ఆకస్మిక వరదలతో హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) అతలాకుతలమవుతోంది. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఎంతోమంది ప్రజలు ఇళ్లని, అయిన వారిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ విపత్తు నుంచి 20 కుటుంబాలు ఓ కుక్క (Dog) అరుపుతో ప్రాణాలతో బయటపడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఈ ప్రకృతి విపత్తుకు మండి (Mandi) జిల్లా తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. జూన్ 30న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మండి జిల్లాలోని ధరంపూర్ ప్రాంతంలో గల సియాతి (Siyathi) గ్రామంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఓ కుక్క ఎన్నడూ లేనివిధంగా విపరీతంగా అరవడం మొదలు పెట్టింది. దీంతో నరేంద్ర అనే వ్యక్తి లేచి బయటకి వచ్చి చూడగా భారీ వర్షానికి తోడు కొండచరియలు విరిగిపడుతుండటాన్ని గమనించారు.
దీంతో వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి గ్రామంలోని వారందరినీ నిద్రలేపారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ సూచించారు. దాదాపు 20 కుటుంబాలకు చెందిన 67 మంది గ్రామాన్ని వీడి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ఆ కొద్దిసేపటికే వారి కళ్లముందే గ్రామం మొత్తం శిథిలమైంది. భారీగా కొండచరియలు విరిగిపడి గ్రామంలోని ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. దీంతో వారంతా సమీపంలోని ఓ ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు.
‘మా ఇంటి రెండో అంతస్తులో నిద్రపోతున్న ఓ కుక్క ఉన్నట్టుండి గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులకు నాకు మెలుకువ వచ్చి బయటకు వచ్చా. అక్కడ గోడకు పగుళ్లు వచ్చి నీరంతా లోపలికి ప్రవేశిస్తోంది. నేను వెంటనే కుక్కను తీసుకుని కిందికు వెళ్లా. ఇంట్లో వాళ్లని, గ్రామస్థులను నిద్రలేపి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోమని చెప్పా. ఇంతలో గ్రామంపైకి కొండచరిలు విరిగిపడ్డాయి. ఇళ్లన్నీ వాటి కింద శిథిలమయ్యాయి’ అని నరేంద్ర తమకు ఎదురైన భయానక అనుభవాన్ని మీడియాకు తెలిపారు.
Also Read..
Nipah Virus | నిఫా వైరస్ వ్యాప్తితో కేరళలో అలర్ట్.. లక్షణాలు, చికిత్స?
Hidden Camera | రహస్య కెమెరాతో.. అనంత పద్మనాభస్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన భక్తుడు