భోపాల్: నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ప్రధాన నిందితుడు ఒక డాక్టర్ అని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. సుమారు రూ.40 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేసినట్లు గుర్తించారు. (Fake Currency Racket) డాక్టర్‌తో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఈ కుంభకోణం బయటపడింది. పెథియా గ్రామానికి చెందిన మౌలానా జుబేర్ అన్సారీ నకిలీ కరెన్సీ మార్పిడి చేస్తూ మహారాష్ట్రలో అరెస్టయ్యాడు. అతడి ఇంట్లో భారీగా నకిలీ కరెన్సీ ఉన్నట్లు నవంబర్ 2న జవార్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అన్సారీ ఇంటిపై రైడ్ చేశారు. రూ.19.78 లక్షల నకిలీ రూ.500 నోట్లు, నోట్ కటింగ్ మెషిన్, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఈ నకిలీ నోట్ల రాకెట్‌పై లోతుగా దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. అసలు సూత్రధారి డాక్టర్ ప్రతీక్ నవలఖే అని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. నవంబర్ 23న రహస్య సమాచారం మేరకు భోపాల్‌లోని గోకుల్ధామ్ సొసైటీలో ఒక అద్దె ఇంటిపై రైడ్ చేశారు. నకిలీ నోట్ల ముద్రణ కోసం కేటాయించిన చిన్న గదిలో ప్రింటర్లు, కట్టర్లు, డ్రైయింగ్ మెషీన్లు, కంప్యూటర్లు వంటివి ఉండటం చూసి షాక్ అయ్యారు. డాక్టర్ ప్రతీక్తోపాటు పాటు గోపాల్ అలియాస్ రాహుల్, హర్దా, దినేష్ గోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్షల విలువైన ఆ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు బుర్హాన్‌పూర్‌కు చెందిన డాక్టర్ ప్రతీక్ గతంలో ఆ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంవో)గా పనిచేశాడు. కీలక ప్రభుత్వ వైద్యాధికారిగా ఉన్నప్పుడు కోట్లలో మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అరెస్టై జైలుకెళ్లాడు. జైలులో ఉన్నప్పుడు మిగతా నిందితులు ఆ డాక్టర్‌కు పరిచయమయ్యారు.
అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత డాక్టర్ ప్రతీక్ తన వైద్య వృత్తికి దూరంగా ఉన్నాడు. గోకుల్ధామ్ సొసైటీలో ఒక ఫ్లాట్ రెంట్‌కు తీసుకున్నాడు. జైలులో పరిచయమైన గోపాల్, హర్దా, దినేష్‌తో కలిసి నకిలీ నోట్ల ప్రింటింగ్ చేపట్టాడు. అంతర్ రాష్ట్ర నకిలీ కరెన్సీ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. పలు నగరాల్లో ఏజెంట్లను నియమించాడు. వారి ద్వారా నకిలీ నోట్లను మార్పిడి చేస్తున్నాడు.
కాగా, భోపాల్‌లోని హోషంగాబాద్ రోడ్డులో ఒక నకిలీ ట్రావెల్ ఏజెన్సీని ఈ ముఠా ఏర్పాటు చేసింది. అయితే నకిలీ కరెన్సీ చెలామణికి ఏజెంట్లను నియమించడం కోసం కార్యాలయంగా దానిని వినియోగిస్తున్నారు. నాగ్‌పూర్, మాలెగావ్, జల్గావ్లకు నకిలీ కరెన్సీని రవాణా చేశారు. మహారాష్ట్రలో అరెస్టైన మౌలానా జుబేర్ అన్సారీ, నకిలీ కరెన్సీ రవాణా మేనేజర్‌గా పోలీసులు గుర్తించారు.
మరోవైపు ఈ ముఠా ఇప్పటి వరకు సుమారు రూ.40 లక్షల విలువైన నకిలీ నోట్లను పంపిణీ చేసిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నకిలీ నోట్లతో ఒక ఆస్తిని కూడా నిందితులు కొనుగోలు చేసినట్లు వివరించారు. ఫేక్ కరెన్సీ కుంభకోణంపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Pankaja Munde’s Key Aide Arrested | భార్య ఆత్మహత్య.. మంత్రి కీలక సహాయకుడు అరెస్ట్
Track Stray Dogs At Schools | స్కూల్స్‌లో కుక్కలను నియంత్రించాలని ఆదేశాలు.. మండిపడుతున్న ఉపాధ్యాయులు
Watch: ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్లపై కుక్కలు.. తర్వాత ఏం జరిగిందంటే?