గువాహతి: అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా (Bhupen Borah) ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. తన రాజీనామాను బోరా వెనక్కి తీసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత భూపేన్ కుమార్ బోరా 2021 నుంచి 2025 వరకు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. గత ఏడాది ఆయన స్థానాన్ని గౌరవ్ గొగోయ్ భర్తీ చేశారు.
కాగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపేన్ బోరా కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. సోమవారం ఉదయం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నాయకత్వం తనను విస్మరిస్తున్నదని, రాష్ట్ర యూనిట్లో తనకు తగిన బాధ్యత దక్కలేదని అందులో ఆరోపించినట్లు తెలిసింది.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తన రాజీనామా లేఖను ఈమెయిల్ చేసినట్లు భూపేన్ బోరా మీడియాకు తెలిపారు. ఏ ప్రత్యేక వ్యక్తి వల్ల లేదా ఏ వ్యక్తిగత కారణం వల్ల పార్టీకి రాజీనామా చేయలేదని చెప్పారు. ‘నేను 32 సంవత్సరాలుగా కాంగ్రెస్‌కు సేవ చేస్తున్నా. పార్టీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నా. పార్టీ హైకమాండ్‌కు పంపిన రాజీనామా లేఖలో నా కారణాలను సవివరంగా వివరించా’ అని అన్నారు.
అయితే, అస్సాం కాంగ్రెస్ మాజీ చీఫ్ భూపేన్ బోరా ఆ పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అస్సాం కాంగ్రెస్ పార్టీలోని చివరి హిందూ నేత ఆ పార్టీని వీడారని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. ఆయనతో పాటు మరికొందరిని బీజేపీలోకి స్వాగతిస్తానని చెప్పారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అస్సాం కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్, పార్టీ నేతలు భన్వర్ జితేంద్ర సింగ్, ప్రద్యుత్ బోర్డోలోయ్, రైజోర్ డోల్ చీఫ్ అఖిల్ గొగోయ్‌తో కలిసి భూపేన్ బోరా ఇంటికి చేరుకున్నారు. ఆయనతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగేందుకు ఒప్పించారు. ఈ నేపథ్యంలో కొన్ని గంటల తర్వాత పార్టీకి చేసిన రాజీనామాను భూపేన్ బోరా ఉపసంహరించుకున్నారు.
Also Read:
Chemical Factory Fire | కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి
Watch: ఇంటిపైన బాంబులు తయారు చేస్తుండగా పేలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: కదులుతున్న కారుపై కూలిన భారీ స్తంభం.. ఎస్పీ నేత మృతి