MUDA | మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో మైసూర్ (Mysuru)లోని ముడా కార్యాలయంపై ఈడీ (Enforcement Directorate) అధికారులు దాడులు చేశారు (raids Mudas office). 12 మంది అధికారుల బృందం శుక్రవారం ఉదయం ముడా కార్యాలయంలో సోదాలు చేపట్టారు.
ముడా కమిషనర్ ఏఎన్ రఘునందన్ సహా సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. భూ కేటాయింపు కేసులో ముడా అధికారుల ప్రమేయాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు సంస్థ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. అనంతరం కేసుకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
ముడా చైర్మన్ రాజీనామా
కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ముడా చైర్మన్ కే మరిగౌడ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశాలతో పాటు తన అనారోగ్య సమస్యల వల్ల రాజీనామా చేస్తున్నానని, తనపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన ప్రకటించారు. ముడా స్కామ్‌పై విచారణ కొనసాగుతున్నదని, అక్రమాలు జరిగాయా అనేది విచారణలో తేలుతుందని పేర్కొన్నారు. తాను 40 ఏండ్లుగా సిద్ధరామయ్యతో ఉన్నానని, ఆయనే తనను తాలుకా, జిల్లా పంచాయతీ అధ్యక్షుడిని చేశారని, చట్టవ్యతిరేక పనులు చేయమని ఆయన తనకు ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఆయన రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
ముడా స్కామ్‌లో సీఎంపై ఆరోపణలు..
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూకుంభకోణం ఆరోపణలు కర్ణాటకలో గత కొన్ని నెలలుగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అడ్డంగా బుక్కయ్యారు. ముడా నుంచి తన భార్యకు అనుచితంగా లబ్ధి కలిగించినట్లు సీఎంపై ఆరోపణలున్నాయి. దీంతో కుంభకోణం వ్యవహారంలో సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు, ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వివాదం నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి కేటాయించిన 14 స్థలాలను ముడా అధికారులు ఇటీవలే వెనక్కి కూడా తీసుకున్నారు. ముడా కుంభకోణం నేపథ్యంలో, తనకు కేటాయించిన భూములను తిరిగి వెనక్కి తీసుకోవాలని సీఎం భార్య మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా)కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ 14 ప్లాట్లను వెనక్కి తీసుకుంటూ సేల్‌డీడ్‌ను రద్దు చేయాలని ముడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ కుంభకోణం వ్యవహారంలో సిద్ధరామయ్యపై విచారణ కొనసాగుతోంది. ఇక ముడా కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయి విచారణను ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య ఏ క్షణంలోనైనా పదవిని కోల్పోతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Also Read..
Meta | ఫుడ్ వోచర్స్‌తో ఇంటి సామాన్లు కొనుగోలు.. ఉద్యోగులపై మెటా ఫైర్
Isha Foundation | ఈషా ఫౌండేషన్‌కు భారీ ఊరట.. ఆ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు
Radhika Merchant | రాధికా మర్చంట్ బర్త్‌డే పార్టీ.. హాజరైన ధోనీ ఇతర స్టార్స్.. ఫొటోలు వైరల్