Elon Musk | అమెరికన్ టైకూన్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధీనంలోని ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ (ఎక్స్) ఇటీవలే మాటిమాటికీ సతాయిస్తోంది. ఏదో ఒక సమస్యతో యూజర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇటీవలే ఎక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడటం.. లాగిన్ కాకపోవడం, ట్వీట్స్ మాయం కావడం వంటి సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి ఎక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. సైట్ ఓపెన్ కావడం లేదు. లాగిన్ అయినా యాక్సిస్ చేయలేక యూజర్లు అసౌకర్యానికి గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ స్పందించారు. ఎక్స్‌పై భారీ సైబర్ దాడి (cyberattack) జరిగినట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడిందని చెప్పారు. ఒక్క రోజులోనే మూడు సార్లు సేవలు నిలిచిపోయాయినట్లు తెలిపారు. దీని వెనుక ఉక్రెయిన్ (Ukraine) హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ‘ప్రతి రోజూ సైబర్ దాడికి గురవుతున్నాం. కానీ, ఇప్పుడు జరిగింది భారీ సైబర్ ఎటాక్. దీని వెనుక పెద్ద గ్రూప్ లేదా ఓ దేశ హస్తం ఉంది. ప్రస్తుతం ఏం జరిగిందనేది కచ్చితంగా చెప్పలేం. ఎక్స్ వ్యవస్థకు అంతరాయం కలిగించేందుకు జరిగిన భారీ సైబర్ దాడి ఇది. ఇందుకు పాల్పడిన ఐపీ అడ్రెస్లు ఉక్రెయిన్ ప్రాంతానికి చెందినదిగా తెలుస్తోంది’ అని మస్క్ ఆరోపించారు.
ట్రేసింగ్ సైట్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. సోమవారం ఒక్కరోజులోనే మూడు సార్లు ఎక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ముందుగా సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పలువురు యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కాసేపటికే ఎక్స్ సేవలను పునరుద్ధరించారు. అయితే, తిరిగి సాయంత్రం 7.30 గంటల సమయంలో మరోసారి డౌన్ అయింది. ఇక రాత్రి 9 గంటలకు మళ్లీ సేవల్లో అంతరాయం నెలకొంది. దీంతో పలువురు ఎక్స్‌ను యాక్సెస్ చేసుకోలేకపోయారు. యూజర్లు ఫీడ్‌ను రిఫ్రెష్ చేయలేక, పోస్ట్‌లు అప్లోడ్ చేయలేకపోయారు.
అమెరికా, ఇండియా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రధాన దేశాల్లో ఈ అంతరాయం నెలకొంది. అమెరికా, యూకేలలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. దాదాపు 40,000 మంది యూజర్లు ఈ సమస్య గురించి ఫిర్యాదు చేశారు. ఇందులో 52 శాతం వెబ్సైట్ సంబంధిత సేవలు, 41 శాతం మంది యాప్ సమస్యలు, 8 శాతం మంది సర్వర్ కనెక్షన్ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు డౌన్‌డిటెక్టర్ పేర్కొంది. ఇక ఇవాళ కూడా ఎక్స్ సేవల్లో అంతరాయం కొనసాగుతోంది. సైట్ ఓపెన్ అయినప్పటికీ.. ఫీడ్న రిఫ్రెష్ చేయలేకపోతున్నారు.
Also Read..
Twitter | ప్రపంచ వ్యాప్తంగా నిలిచిన ఎక్స్ సేవలు.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న యూజర్లు
Stock Markets: ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు డౌన్.. పడిపోయిన నిఫ్టీ, సెన్సెక్స్ ట్రేడింగ్