ముంబై : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వాణిజ్య నిర్ణయాలు.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల(Stock Markets)ను కుదిపేస్తున్నాయి. అమెరికా ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో.. వాల్ స్ట్రీట్ మార్కెట్ సోమవారం కుప్పకూలింది. ఆ ఎఫెక్ట్ మిగితా దేశాలపై పడింది. ఇవాళ ఉదయం ఇండియన్ మార్కెట్లపై కూడా ఎఫెక్ట్ చూపించింది. సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్లు.. ఇవాళ ట్రేడింగ్‌లో డౌన్ అయ్యాయి. సెన్సెస్ ట్రేడింగ్‌లో 400 పాయింట్లు డౌన్ అయ్యింది. నిఫ్టీ కూడా తక్కువకే ట్రేడ్ అవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 87.38గా ఉన్నది.
అమెరికన్ వాల్ స్ట్రీట్‌లో సుమారు నాలుగు ట్రిలియన్ల మేర ట్రేడ్ మార్కెట్ ఆవిరైపోయింది. ట్రంప్ ఆర్థిక విధానాలతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొన్నది. ఆర్థిక సంక్షోభం వస్తుందన్న నేపథ్యంలో భయాందోళనలు అధికం అవుతున్నాయి. ఆ టెన్షన్లో మార్కెట్లు తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. అధిక సుంకాలను తగ్గించేందుకు ట్రంప్ నిరాకరించడం వల్లే గ్లోబల్ మార్కెట్లో వడిదిడుకులు మొదలయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ.. ట్రాన్షిషన్ పీరియడ్‌లో ఉన్నట్లు ఇటీవల ట్రంప్ తెలిపారు. ట్రాన్షిషన్ పీరియడ్ వల్ల అమెరికాకు లాభం జరుగుతుందని, అమెరికాకు సంపదను తీసుకువస్తున్నామని, అదో పెద్ద విషయం అని ట్రంప్ చెప్పారు.
ఇవాళ గ్లోబల్ ట్రేడింగ్‌లో.. జపాన్ నిక్కీ 225 మార్కెట్ 1.7 శాతం తక్కువ ట్రేడ్ అయ్యింది. దక్షిణ కొరియాకు చెందిన కోప్సీ 1.5 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.7 శాతం తక్కువ ట్రేడ్ అయ్యాయి. సోమవారం అమెరికాకు చెందిన మార్కెట్లో ఎస్ అండ్ పీ 500లో.. ట్రేడింగ్ 2.7 శాతం పడిపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ లో ట్రేడింగ్ 2 శాతం పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. టెక్నాలజీ షేర్లు కూడా భారీగా పడిపోయాయి. నాస్డాక్లో 4 శాతం షేర్లు డౌన్ అయ్యాయి. ఇక టెస్లా కంపెనీ షేర్లు 15.4 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ కంపెనీ ఎన్విదియా షేర్లు 5 శాతం పడిపోయాయి. మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్ కంపెనీల షేర్లు కూడా దారుణంగా పడిపోయాయి.