Punjab | భారీ వర్షాలు, వరదలతో ఉత్తర భారతం అతలాకుతలం అవుతున్నది. అనేక రాష్ట్రాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిసింది. ఊర్లకు ఊర్లు చెరువులను తలపిస్తుండగా రోడ్లు నీటమునిగిపోయాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. డజన్ల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇక ఇటీవలే కురిసిన వర్షాలకు పంజాబ్ (Punjab) రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే.
భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతోపాటు డ్యాంల నుంచి నీటిని విడుదల చేయడంతో పంజాబ్‌లోని 10కిపైగా జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. గడచిన 25 ఏళ్లలో మొట్టమొదటిసారి సాధారణం కన్నా 74 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వారం రోజుల్లో 30 మందికిపైగా మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 23 జిల్లాల్లోని 1,300 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. నడుము లోతు నీటిలో వాలంటీర్లు (Relief Workers) బాధితులకు సాయంగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలో తమకు సాయం చేసేందుకు వచ్చిన వాలంటీర్లకు ఓ వృద్ధుడు టీ అందించడం (Elderly Man Seen Serving Tea) అందరినీ ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ (Harbhajan Singh) తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. వరదల్లో సర్వం కోల్పోయినా.. సాయం చేసేందుకు వచ్చిన వారికి ఓ కుటుంబం టీ అందించినట్లు పేర్కొన్నారు. పంజాబ్ స్ఫూర్తి అంటే ఇదే.. అంటూ వీడియోకి క్యాప్షన్‌గా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
When volunteers went to deliver relief materials, the flood-affected family despite having lost almost everything prepared tea and served it to the volunteers in return. That’s the spirit of Panjab. Rab de bande. #Punjab #PunjabFloods pic.twitter.com/EVdCuHlKuP
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 3, 2025
ఇక ఈ వర్షాలు, వరదలకు పంజాబ్‌లో భారీ నష్టం వాటిల్లింది. సుమారు 3.5 లక్షలకు పైగా నివాసితులు ప్రభావితమయ్యారు. 20,000 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలు, వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం 122 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. అందులో వేలాది మంది ఆశ్రయం పొందుతున్నారు. వర్షాలు, వరదలకు రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో వరదలో చిక్కుకుపోయిన వారికి ఆహారం, మందులు అందించేందుకు డ్రోన్లను మోహరించారు. ఇక ఈ వరదలకు 61,000 హెక్టార్లకు పైగా వ్యవసాయ భూములు నీట మునిగాయి. 2.32 లక్షల ఎకరాలకు పైగా వరి పంట దెబ్బతిన్నది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read..
IndiGo | విమానంలో తప్పతాగి వికృత చేష్టలు.. మతపరమైన నినాదాలు చేసిన లాయర్
Raghav Chadha | ‘పంజాబ్ డబ్బు పంజాబ్ ప్రజలకే’.. రూ.3.25 కోట్ల నిధులు ప్రకటించిన రాఘవ్ చద్దా
ChatGPT | చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం.. సోషల్ మీడియా ద్వారా యూజర్లు ఫిర్యాదు