2050నాటికి దేశంలో మూడు రెట్లు పెరగనున్న వృద్ధులు

న్యూఢిల్లీ: ఇండియాలో 2050 నాటికి వృద్ధుల జనాభా 31.9 కోట్లకు చేరనున్నట్లు లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఆఫ్ ఇండియా (ఎల్ఏఎస్ఐ) సర్వే వెల్లడించింది. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 2011 లెక్కల ప్రకారం దేశంలో 60 ఏళ్లకు పైబడిన వారు 10.3 కోట్లతో మొత్తం జనాభాలో 8.6 శాతంగా ఉన్నారు. ఏడాదికి వృద్ధుల సంఖ్య 3 శాతం పెరుగుతూ వెళ్తే 2050 నాటికి 31.9 కోట్లకు చేరుతుందని ఎల్ఏఎస్ఐ అంచనా వేసింది. వీరిలో 75 శాతం మంది ఏదో ఒక తీవ్రమైన రోగంతో బాధపడతారని, 40 శాతం మంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలతో బాధపడతారని, 20 శాతం మంది మానసిక సమస్యలు ఎదుర్కొంటారని కూడా ఈ సర్వే తేల్చింది.
ఈ నివేదికను హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్లతో కలిసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ రూపొందించింది. వృద్ధుల కోసం ఎలాంటి కార్యక్రమాలు, విధానాలను రూపొందించాలో ప్రభుత్వాలకు మార్గనిర్దేశనం చేయడానికి ఈ నివేదిక ఉపయోగపడుతుంది.