ఖమ్మం, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఖరారు చేస్తూ ఏఐసీసీ ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. దాదాపు 20రోజులపాటు తీవ్ర తర్జనభర్జనల మధ్య ఎట్టకేలకు రఘురాంరెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో పార్టీ వర్గాల్లో కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. 25వ తేదీ నామినేషన్‌కు చివరితేదీ కావడంతో ఎట్టకేలకు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఖమ్మం టికెట్ కోసం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు హోరాహోరీగా పోరు సాగించారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డి కోసం, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన తనయుడు యుగంధర్‌కు టికెట్ కేటాయించాలని చివరినిమిషం వరకు పోరాడారు. అయితే రఘురాంరెడ్డికి ఖరారుకావడంతో పొంగులేటి వ్యూహం ఫలించిందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తన సోదరుడు ప్రసాద్‌రెడ్డికి ఇవ్వని పక్షంలో తన వియ్యంకుడు రఘురాంరెడ్డికి ఇవ్వాలని ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
అధిష్టానంపై అనేక రకాలుగా చేసిన ఒత్తిళ్ల నేపథ్యంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని రఘురాంరెడ్డి పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ బీ హనుమంతరావు, కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, ప్రియాంకగాంధీ పోటీచేస్తారని ప్రచారం జరిగింది. ఏదేమైనా రఘురాంరెడ్డికి టికెట్ లభించడంతో కాంగ్రెస్ అధిష్టానం వద్ద పొంగులేటి హవా కొనసాగుతుందనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
ఇతర నేతలు ఏ విధంగా స్పందిస్తారో అన్న అంశం చర్చనీయాంశమైంది. రఘురాంరెడ్డి తరఫున మంత్రి పొంగులేటి అనుచరులు, రఘురాంరెడ్డి సమీప బంధువు నూకల నరేశ్‌రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. నేడు ఉదయం 11గంటలకు రఘురాంరెడ్డి స్వయంగా ఖమ్మం వచ్చి పార్టీ నేతలు జిల్లాకు చెందిన మంత్రుల సమక్షంలో మరో రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రఘురాంరెడ్డి అభ్యర్థిత్వం ఖరారు కావడంతో తుమ్మల, మల్లు భట్టి వర్గీయులకు షాక్ తగిలినట్లు అయ్యింది.