లక్నో: ఒక వృద్ధ జంట ఆస్తిపై లాయర్ కన్నువేశాడు. వారి మూడు షాపులను మోసపూరితంగా స్వాధీనం చేసుకుని అమ్మేశాడు. తనపై ఫిర్యాదు చేయడంతో వారి హత్యకు ప్లాన్ వేశాడు. డబ్బు, బహుమతులను ఎర వేసి కుమారులతోనే వారి తల్లిదండ్రులను హత్య చేయించాడు. (Sons Kills Elder Parents) ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కంబా పోఖర్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల రోషన్ ఖాన్, 60 ఏళ్ల వాసీలా భార్యాభర్తలు. రోషన్ ఖాన్‌కు మొదటి వివాహం ద్వారా హసీబ్ ఖాన్, నసీబ్ ఖాన్‌తోపాటు భార్య వసీలా మొదటి వివాహం ద్వారా ముసిబ్ ఖాన్‌తో కలిపి ముగ్గురు కుమారులున్నారు.
కాగా, రోషన్ ఖాన్‌కు ఇకౌనా ప్రాంతంలో మూడు షాపులున్నాయి. ఆగస్టులో డీడ్ ద్వారా ఆ షాపులను భార్య వాసీలాకు బదిలీ చేశాడు. అయితే డీడ్ పనులు చూసిన న్యాయవాది ప్రభాకర్ త్రిపాఠి అలియాస్ రింకు ఆ షాపులను కాజేసేందుకు కుట్రపన్నాడు. అదే రోజున వాసీలాకు రూ.10 లక్షల చెక్కు చూపించి నకిలీ సేల్ డీడ్‌పై సంతకం చేయించాడు. వాటిని స్వాధీనం చేసుకున్న అతడు మరో వ్యక్తికి రూ.80 లక్షలకు విక్రయించాడు.
మరోవైపు న్యాయవాది ప్రభాకర్ త్రిపాఠి మోసాన్ని వాసీలా గ్రహించింది. ఆ సేల్ డీడ్ రద్దు చేయాలని కోరుతూ జిల్లా కోర్టు, హైకోర్టులో పిటిషన్లు వేసింది. అలాగే ఆ లాయర్ మోసంపై ఇకౌనా పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు న్యాయవాది ప్రభాకర్ కుట్ర పన్నాడు. డబ్బు, గిఫ్ట్‌లతో ఆ వృద్ధ జంట ముగ్గురు కుమారులను ఆకట్టుకున్నాడు. తల్లిదండ్రులను హత్య చేస్తే ఒక కుమారుడికి బైక్, రూ.10 లక్షల డబ్బు, ఇతర కుమారులకు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు.
కాగా, లాయర్ ప్రభాకర్ త్రిపాఠికి వశమైన ముగ్గురు కుమారులు తమ తల్లిదండ్రులైన రోషన్ ఖాన్, వసీలాను హత్య చేశారు. నవంబర్ 22 అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రిస్తున్న తల్లిదండ్రుల గొంతునొక్కి చంపారు. గుర్తు తెలియని వ్యక్తులు వారిని హత్య చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు.
మరోవైపు నవంబర్ 23న రోషన్ ఖాన్ మృతదేహాన్ని అతడి ఇంట్లో, సమీపంలోని పొదల్లో వాసీలా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం నిర్వహించగా వెదురుకర్రతో గొంతునొక్కి వారిని హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, ఇతర ఆధారాలు పరిశీలించారు.
న్యాయవాది ప్రభాకర్ త్రిపాఠి మోసపూరితంగా వారి షాపులు దక్కించుకుని ముగ్గురు కుమారులతో హత్య చేయించినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. దీంతో నిందితులైన ఆ నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. న్యాయవాది ప్రభాకర్ త్రిపాఠిపై ఇప్పటికే మోసం కేసు నమోదైనట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఒక కుమారుడైన హసీబ్ ఖాన్‌పై కూడా దాడి కేసు ఉన్నట్లు వెల్లడించారు.
Also Read:
Air India Plane | ఎయిర్ ఇండియా విమానంలో పొగ సంకేతం.. వెనక్కి మళ్లి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్
Watch: పెళ్లైన జంటను ఆశీర్వదించేందుకు వేదిక ఎక్కిన బీజేపీ నేతలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: ప్లాస్టిక్ బొమ్మకు దహన సంస్కారాలకు యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?